బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంట్ యూట్యూబ్ ఛానల్ కు షాక్-సంసద్ టీవీకి 3 గంటల బ్రేక్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ ఉభయ సభల సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్ సంసద్ టీవీకి బ్రేక్ పడింది. ఇవాళ సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ ను కొందరు హ్యాక్ చేశారు. దీంతో కొన్ని గంటల పాటు ప్రసారాలు నిలిచిపోవడమే కాకుండా దాని పేరు కూడా మారిపోయింది. చాలా మందికి ఎర్రర్ మెసేజ్ కూడా వస్తోంది. దీంతో ప్రసార భారతి దీనిపై ఓ ప్రకటన చేసింది.
లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసే సంసద్ టీవీ, యూట్యూబ్ కమ్యూనిటీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దాని ఖాతా రద్దు చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. ఇది జరిగిన కొద్దిసేపటికే, కొంతమంది స్కామ్‌స్టర్ల ద్వారా తమ యూట్యూబ్ ఖాతా హ్యాకింగ్ జరిగిందని, ఛానెల్ పేరు 'ఎథెరియం' గా మారినట్లు ప్రసార భారతి వివరణ ఇచ్చింది. యూట్యూబ్ అభ్యంతరాలపై స్పందించి దీన్ని పునరుద్ధరిస్తామని కూడా ప్రసార భారతి వెల్లడించింది.

సంసద్ టీవీ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్‌తో సహా కొంతమంది స్కామ్‌స్టర్లు చేసిన అనధికార కార్యకలాపాల కారణంగా సంసద్ టీవీ భద్రతా పరంగా రాజీపడినట్లు ప్రభుత్వం చెబుతోంది. అలాగే, హ్యాకింగ్ చేసిన వ్యక్తి ద్వారా ఛానెల్ పేరు ఎధీరియంగా మార్చడం కూడా జరిగింది. అయితే , సంసద్ టీవీ సోషల్ మీడియా బృందం తక్షణమే దానిపై దృష్టిసారించింది. మూడు గంటల అంతరాయం తర్వాత దీన్ని తిరిగి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. భారతదేశంలోని సైబర్ భద్రతా సంఘటనలపై స్పందించే నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా ఈ సంఘటనపై తమ యాజమాన్యాన్ని కూడా అప్రమత్తం చేసినట్లు సంసద్ టీవీ తెలిపింది.












Click it and Unblock the Notifications