Donald Trump: గ్రీన్ ల్యాండ్ కొనేస్తా- డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం..!
అమెరికాకు 45వ అధ్యక్షుడిగా వచ్చే నెలలో ప్రమాణస్వీకారం చేయబోతున్న డొనాల్ట్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టకముందే తన ప్రణాళికల్ని దూకుడుగా అమలు చేసేస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వంలో ఉండే అధికారుల్ని, మంత్రుల్ని నిర్ణయించేసుకున్న ట్రంప్.. తాను అధ్యక్షుడు కాగానే తీసుకోబోయే నిర్ణయాల్ని కూడా వరుసగా వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పనామా కాలువపై నియంత్రణ సాధిస్తామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ దీవినీ కొనేసి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని వెల్లడించారు.
జాతీయవాదిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతోనే ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ జాతీయ వాదిగా పేరు తెచ్చుకున్న ట్రంప్.. మరోసారి తనను గెలిపిస్తే అదే నినాదంతో పనిచేస్తానని ఓటర్లకు చెప్పి మరీ గెలిచారు. దీంతో అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికాను ఆర్ధికంగా, భౌగోళికంగా, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు.

ఇదే క్రమంలో తాజాగా తన సొషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న స్వతంత్ర దీవి గ్రీన్ ల్యాండ్ ను కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జాతీయ భద్రత, స్వేచ్ఛ ప్రయోజనాల కోసం గ్రీన్‌ల్యాండ్ యాజమాన్యం, నియంత్రణ ఒక సంపూర్ణ అవసరమని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భావిస్తోందని అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. గ్రీన్‌లాండ్ స్వయంప్రతిపత్తి కలిగిన స్వయం పాలనను కలిగి ఉన్నప్పటికీ, అది ఇప్పటికీ డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉంది. దీంతో ఆ దీవిపై నియంత్రణను ట్రంప్ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications