Yes She Can: కమలా హ్యారిస్ కోసం బరాక్ ఒబామా త్యాగం..! కొత్త స్లోగన్ ఇదే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకూ, రిపబ్లికన్లకూ మధ్య ఈసారి హోరాహోరీ పోరు సాగుతోంది. ముఖ్యంగా రిపబ్లికన్ అభ్యర్ధిగా మరోసారి పోటీకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును అడ్డుకునేందుకు డెమోక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇదే క్రమంలో ఆమెకు సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు అండగా నిలిచారు. అంతే కాదు ఒబామా అయితే తన పాత నినాదాన్ని ఆమె కోసం మార్చి మరీ ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఇవాళ చికాగోలో జరుగుతున్న డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో పదునైన ప్రసంగాలు చేశారు. ఇందులో డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్ధిగా రేసులో నిలిచిన తొలి నల్లజాతి, దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిపించి తీరాలని వారు ఓటర్లను కోరారు. 2008లో తన ప్రచారంలో పదే పదే వాడిన సక్సెస్ ఫుల్ స్లోగన్ యస్ వీ కెన్ (yes we can)ను సైతం ఒబామా తెరపైకి తెచ్చారు.

అప్పట్లో అమెరికన్లను తనవైపు తిప్పుకునేందుకు, వారిలో పట్టుదలను నింపేందుకు తాను వాడిన స్లోగన్ ను కాస్త మార్చి యస్ షీ కెన్ (yes she can) అంటూ బరాక్ ఒబామా జనంలోకి తీసుకెళ్లారు. దీనికి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. ఏదైనా సాధ్యమని నమ్మే వారికి తన మాటలు ఎప్పుడూ మంచివేనని ఒబామా సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో తన డిప్యూటీగా జో బైడెన్ ను ఎంచుకున్న నిర్ణయాన్ని గుర్తుచేసుకున్న ఒబామా దాన్ని బైడెన్ తిరిగి కమలా హ్యారిస్ ను డిప్యూటీగా ఎంచుకోవడంతో పోల్చారు.
అలాగే కమలా హ్యారిస్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఒబామా విరుచుకుపడ్డారు. ఇక్కడ 78 ఏళ్ల బిలియనీర్ ఉన్నాడని, అతను తొమ్మిదేళ్ల క్రితం తన గోల్డెన్ ఎలివేటర్‌పై ప్రయాణించినప్పటి నుండి తన సమస్యల గురించి ఏడుపు మానలేదని చురకలు అంటించారు. కమల చేతిలో ఓడిపోతానేమోనన్న భయంతో ఆయన మనోవేదన ఎక్కువవుతోందని, ఇది కుట్రలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ట్రంప్ విభజన రాజకీయాలకు పాల్పడ్డారని, అమెరికాకు మరో నాలుగేళ్ల గందరగోళం అవసరం లేదని ఒబామా తెలిపారు.












Click it and Unblock the Notifications