ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ప్రకటించిన రష్యా..!!
ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీపై అంతర్జాతీయ వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ డాక్యుమెంటరీని రష్యా తప్పుపట్టింది. సమాచార యుద్ధానికి బీబీసీ పాల్పడుతోందని ఆరోపించింది.
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా పూర్తి మద్దతును ప్రకటించింది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ- ఆయనపై చిత్రీకరించిన డాక్యుమెంట్ పై భారత్ లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అండగా నిలిచింది. బీబీసీపై ఘాటు విమర్శలు సంధించింది. భారత్ పై పరోక్షంగా సమాచార యుద్ధానికి పాల్పడినట్లు ఆరోపించింది. బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడాన్ని రష్యా సమర్థించింది.
ఇండియా- ది మోదీ క్వశ్చన్ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీని దేశంలో ఎక్కడ కూడా దీన్ని ప్రదర్శించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీ ఉండటం వల్ల దీన్ని నిషేధించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. దీని తరువాత కూడా కేరళతో పాటు ఢిల్లీ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి కొన్ని చోట్ల దీన్ని ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇవ్వాళ పలు పిటీషన్లు దాఖలయ్యాయి

నిషేధం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమంటూ పిటీషనర్లు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద అత్యవసరంగా లిస్టింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ అడ్వొకేట్ ఎంఎల్ శర్మ ఈ పిటీషన్ వేశారు. ఆయనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రా కూడా మరో పిటీషన్ వేశారు.
ఈ పరిణామాల మధ్య రష్యా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ కు వ్యతిరేకంగా బీబీసీ వివిధ రంగాలలో సమాచార యుద్ధం చేస్తోందని ఆరోపించింది. భారత్ లో వివిధ రంగాల్లో బీబీసీ సమాచార యుద్ధానికి పాల్పడుతోందనడానికి బీబీసీ డాక్యుమెంటరీ ఓ సాక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. భారత్, ఆ దేశంతో మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న రష్యాపై మాత్రమే కాకుండా, ఇతర ప్రపంచ దేశాల విధానాలనూ బీబీసీ ప్రశ్నించినట్టయిందని చెప్పారు.

రష్యాపై మాత్రమే కాకుండా, స్వతంత్ర విధానాలను అనుసరిస్తున్న ఇతర ప్రపంచ దేశాలకు కూడా వ్యతిరేకంగా బీబీసీ ఈ తరహా సమాచార యుద్ధానికి పాల్పడినట్లుగా తాము భావిస్తోన్నామని మరియా జఖరోవా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా బీబీసీ.. బ్రిటీష్ స్థాపన కోసం పోరాడుతున్నట్లుగా, కొంతమంది ప్రయోజనాల కోసం పని చేస్తోన్నట్లుగా కనిపిస్తోందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications