ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్
ఇరాన్ తో చర్చలు విఫలమైన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ వార్ మోడ్ లోకి వెళ్లింది. ఇరాన్ పోర్టులను దిగ్బంధించనుంది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి ఇది అమలులోకి రానుంది. ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాలు, అరేబియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్‌లోని సముద్ర మార్గాలను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలపై దిగ్బంధం కొనసాగుతుందని సెంట్ కామ్ ప్రకటించింది.
హార్ముజ్ జలసంధి గుండా నాన్ ఇరాన్ పోర్టులకు ప్రయాణించే నౌకలకు ఇది వర్తించదు. ఇతర దేశాలకు చెందిన కార్గో షిప్ ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని సెంట్ కామ్ స్పష్టం చేసింది. ఒమాన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే వాణిజ్య నౌకాదళ సిబ్బంది కోసం ఎప్పటికప్పుడు నోటీస్ టు మెరైనర్స్ జారీ చేయనుంది అమెరికా. దీనికి సంబంధించి అమెరికా నావికా దళాలను బ్రిడ్జ్-టు-బ్రిడ్జ్ ఛానెల్ 16 ద్వారా సంప్రదించాలని సూచించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించారు కూడా. త్వరలోనే హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటామని ప్రకటించారు. ఇరాన్ వసూలు చేస్తోన్న టోల్ ను చట్టవిరుద్ధమైనదిగా అభివర్ణించారు. టోల్ చెల్లిస్తున్న నౌకలే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యూహాత్మక గల్ఫ్ మార్గంలో కొన్ని నౌకలు చైనీస్ యువాన్‌ను వాడుతోండటం, పెట్రోడాలర్ వ్యవస్థను సవాలు చేస్తోండటం, తాము విధించిన ఆంక్షలను తప్పించుకుంటున్నందున అమెరికా ఈ దిగ్భంధానికి పూనుకున్నట్లు తెలుస్తోంది.
దీని ద్వారా చైనా, ఇరాన్‌ల పట్ల తన వైఖరిని అమెరికా మరింత కఠినతరం చేసిందనేది స్పష్టమౌతోంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొనామ్మద్ బఖర్ ఖలీబాఫ్ మండిపడ్డారు. ఓడరేవులు, వాణిజ్య నౌకల దిగ్బంధనం వల్ల అమెరికాకు ఇంధన ధరల సెగ మరింత తీవ్రంగా తగులుతుందని హెచ్చరించారు. గ్యాస్, ఆయిల్ కోసం అమెరికన్లు రోజుల తరబడి పడిగాపులు పడే పరిస్థితులు త్వరలోనే రాబోతోన్నాయని తేల్చి చెప్పారు.
ఇరాన్‌కు టోల్ చెల్లించిన ప్రతి నౌకను అంతర్జాతీయ జలాల్లో తమ బలగాలు వెంటాడి మరీ అడ్డుకుంటాయని డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరించారు. అక్రమ రుసుము చెల్లించిన వారికి సముద్ర జలాలపై సురక్షితంగా ప్రయాణించే వీలు ఉండదని స్పష్టం చేశారు. తమ చర్యలను అడ్డుకునే వారిని నరకానికి పంపిస్తామని హెచ్చరించారు. దీనికి అనుగుణంగా తాజాగా సెంట్ కామ్ దిగ్బంధన చర్యలకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications