భారత్ ను దెబ్బకొడితే రష్యా దారికొస్తుందట: ఇదేం లాజిక్కో మరి
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
భారత్ పై విధించిన టారిఫ్ మొత్తాన్ని 25 నుంచి 50 శాతానికి పెంచడానికి గల కారణానలు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లివిట్ వెల్లడించారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కొనసాగించకుండా నిరోధించడంలో భాగంగా భారత్ పై అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నారని, భారత్‌పై విధించిన అదనపు టారిఫ్, ఇతర ఆంక్షలు ఇందులో భాగమేనని అన్నారు. ఈ యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని ట్రంప్ భావిస్తోన్నారని, ఇది కొనసాగాలని ఎంతమాత్రం కోరుకోవట్లేదని పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ సమావేశమైన మరుసటి రోజే వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పాలని ట్రంప్ కోరుకుంటున్నారని లివిట్ స్పష్టం చేశారు. ట్రంప్ శాంతి ప్రయత్నాల వల్ల ఇటీవలే పుతిన్‌తో సమావేశమైన యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు.. 48 గంటల్లోపే వాషింగ్టన్‌కు తరలివచ్చారని లీవిట్ గుర్తు చేశారు.
వైట్ హౌస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను యూరోపియన్ యూనియన్ ప్రశంసించిందని లివిట్ తెలిపారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే యుద్ధం మొదలై ఉండేది కాదని ఆయా దేశాలు అభిప్రాయపడుతున్నాయని వివరించారు.












Click it and Unblock the Notifications