France Riots : ఫ్రాన్స్ వ్యాప్తంగా అల్లర్లు-1300 మందికి పైగా అరెస్టు-ఎమర్జెన్సీ విధించే ఛాన్స్..
ఫ్రాన్స్ లో నాలుగు రోజుల క్రితం ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపిన తర్వాత మొదలైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అల్లర్లు, నిరసనల మధ్యలోనే దోపిడీలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమవుతోంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివారులో ఓ యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై మొదలైన నిరసనలు ఇవాళ నాలుగో రోజుకు చేరుకున్నాయి. నహెల్ అనే బాలుడిని పారిస్ శివారులోని నాంటెర్‌లో ట్రాఫిక్ ఆగిపోతున్న సమయంలో పోలీసులు కాల్చివేశారు. దీంతో చెలరేగిన హింస శనివారం కూడా నాంటెర్రేలో కొనసాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా 1300 మందికి పైగా అరెస్టయ్యారు. అనేక నగరాలు కర్ఫ్యూలు విధించాయి.

దేశవ్యాప్తంగా ఇవాళ నాలుగో రోజు రాత్రి కూడా అశాంతి ఏర్పడే ప్రమాదం ఉన్నందున ఫ్రాన్స్ ఈ రాత్రి 45,000 మంది పోలీసులను మోహరించింది. అల్లర్ల నియంత్రణ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా పోలీసులు ప్రజా రవాణాను నిలిపివేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అల్లర్లలో పాల్గొంటున్న పిల్లల్ని నియంత్రించాలని వారి తల్లితండ్రుల్ని కోరారు. అల్లర్లలో ఎక్కువగా పాల్గొంటోంది వీరే.
దేశవ్యాప్తంగా హింసను అణిచివేసేందుకు భారీ పోలీసు మోహరింపు ఉన్నప్పటికీ, అల్లర్లు, దోపిడీలు ఇవాళ కూడా కొనసాగాయి. దేశంలో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 1,311 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఫ్రాన్స్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాప్పే సోషల్ మీడియాలో హింసను ముగించాలని పిలుపునిచ్చారు. రేపటిలోగా పరిస్దితులు అదుపులోకి రాకపోతే ఎమర్జెన్సీ విధించేందుకు మాక్రాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications