ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులను కొనసాగిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇక ఇరాన్ తో యుద్ధం ముగించేందుకు ఒప్పందం కుదరాలంటే వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో చమురు కొరత ప్రారంభమై తీవ్రస్థాయికి చేరింది. ఈ ఇంధన సంక్షోభం ఇప్పుడు ఇరాన్ కు వరంగా మారినట్లు తెలుస్తోంది. చమురు ఎగుమతి ద్వారా ఇరాన్ రోజుకు దాదాపు రూ. 1,319 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు సమాచారం. గల్ఫ్ దేశాలు చమురు రవాణా చేసేందుకు ఇబ్బందులు పడుతుంటే ఇరాన్ మాత్రం అందుకు భిన్నంగా రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధనానికి డిమాండ్ పెరగడం ఆ దేశానికి ప్లస్ అయింది. ఇక ప్రపంచంలోనే చమురు నిల్వల్లో ఇరాన్ మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో వెనీజులా, సౌదీ అరేబియా ఉన్నాయి.
తాజాగా బ్లూబ్ బర్గ్ కథనం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఓవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం చమురు ఎగుమతిని ఆపడం లేదు. ప్రపంచ దేశాల్లో ఇంధన కొరతను తీరుస్తూ రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసి రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయాన్ని అర్జిస్తున్నట్లు సమాచారం. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సరఫరా చేసేందుకు గల్ఫ్ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇక ఇప్పటికే హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించిన ఇరాన్.. చమురును సులభంగా ఇతర దేశాలకు సరఫరా చేస్తోంది. చమురు ట్యాంకర్లు ఖర్గ్ ఐలాండ్ వద్ద లోడ్ అవుతున్నాయి. అలాగే హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాలకు తరలివెళ్తున్నాయి.

ఫిబ్రవరిలో చమురు ఎగుమతి కారణంగా రోజుకు 115 మిలియన్ డాలర్లను ఆర్జించిన ఇరాన్.. ఇప్పుడు ఏకంగా 139 మిలియన్ డాలర్లకు పెరగడం కీలకంగా మారింది. ఓవైపు యుద్ధాన్ని ఎక్కువ రోజులపాటు కొనసాగించేందుకు ఈ నగదును ఇరాన్ తమ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ కథనం పేర్కొంది.












Click it and Unblock the Notifications