Iran War: సీజ్ ఫైర్ బ్రేక్-మళ్లీ హార్ముజ్ మూసేసిన ఇరాన్..!
హార్ముజ్ జలసంధి తెరవాలన్న ప్రధాన షరతుతో నిన్న రాత్రి అమెరికా-ఇరాన్ (iran) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది రెండు వారాల పాటు అమలు చేయాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. దీన్ని ఇజ్రాయెల్ కూడా పాక్షికంగా స్వాగతించింది. అయితే ఇవాళ పరిస్ధితి మళ్లీ మొదటికొచ్చింది. తిరిగి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. అలాగే లెబనాన్ పై దాడులు కూడా కొనసాగిస్తోంది. దీంతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
ఇరాన్ ని పలు ప్రాంతాలపై ఇవాళ ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దీంతో అమెరికా చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించిన ఇరాన్.. హార్ముజ్ జలసంధి ద్వారా వెళుతున్న చమురు ట్యాంకర్లను నిలిపివేసింది. ఈ మేరకు ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించినట్లు రాయిటర్స్ తెలిపింది. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇది కీలకమైన ప్రపంచ ఇంధన రవాణాకు మళ్లీ అంతరాయం కలిగిస్తుందనడానికి సంకేతంగా తెలుస్తోంది.

ఇవాళ ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడుల్ని తిరిగి ప్రారంభించింది. కువైట్ మీద ఇవాళ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లను తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి అర్దం కావడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ ను ప్రకటించిన తర్వాత కూడా జరుగుతున్న ఈ దాడులతో ఇరాన్ వార్ మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ట్రంప్ బయటపడిపోవడంతో ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications