ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం నాలుగో వారానికి చేరుకున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా వెనక్కి తగ్గి కాల్పుల విరమణను తెరపైకి తెచ్చారు. ఇరాన్ తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నామని, కాబట్టి ఐదు రోజుల పాటు ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడులకు బ్రేక్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం నెల రోజుల కాల్పుల విరమణకు వీలుగా ఇరాన్ కు 15 షరతుల్ని ప్రతిపాదించారు. అయితే ఇరాన్ చర్చలు అబద్ధమని తేల్చేయడంతో పాటు సీజ్ ఫైర్ కూ తిరస్కరించింది.
మళ్లీ మొదటికొచ్చిన ఇరాన్ వార్ (iran war)
దీంతో ఇవాళ ఇజ్రాయెల్ యథావిధిగా ఇరాన్ పై దాడుల్ని ముమ్మరం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల్లోనూ యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలతో సహా ఈ ప్రాంతంలోని పలు దేశాలకు దాడులు, ప్రతిదాడులు విస్తరించాయి. అమెరికన్ విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ ను వేరే చోటికి తరలించేలా ఒత్తిడి చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ఆధీనంలోని ఖర్గ్ ద్వీపంపై భారీగా దాడులు చేసి అమెరికా స్వాధీనం చేసుకోవచ్చనే నిఘా సమాచారంతో అక్కడికి భారీగా బలగాల్ని తరలిస్తున్నారు.

ఓటమిని అంగీకరించబోమన్న ఇరాన్
టెహ్రాన్, వాషింగ్టన్ నుండి వస్తున్న దౌత్య సంకేతాలు తీవ్రంగా పరస్పర విరుద్ధంగా ఉండటంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయన్న వాదనలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి గట్టిగా తిరస్కరించారు. టెహ్రాన్ ప్రస్తుత విధానం సంభాషణల మీద కాకుండా ప్రతిఘటన మీద ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వ టీవీలో మాట్లాడుతూ చర్చల గురించిన ఏ ప్రస్తావననైనా అకాలమైనదిగా, ఇంకా చెప్పాలంటే ఓటమిని అంగీకరించడమేగా కొట్టిపారేశారు.
ఐరాస హెచ్చరికలు
పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద, ఇరాన్ శత్రు నౌకల రాకపోకలను నిషేధించింది. దీంతో ఈ కీలక సముద్ర మార్గం ఇంకా ముప్పులోనే ఉంది. ఎర్ర సముద్రానికి ముప్పుతో సహా మరిన్ని అంతరాయాలు ఏర్పడే అవకాశం, ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆర్థిక స్థిరత్వంపై భయాలను పెంచుతోంది.

ఒకేసారి దౌత్యం, ఒత్తిడి
యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరు పక్షాలు ఒత్తిడి మరియు దౌత్యం అనే సమాంతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్ దాడులకు వ్యతిరేకంగా హామీలు, నష్టపరిహారంతో సహా సంఘర్షణను ముగించడానికి ఇరాన్ తన సొంత షరతులను నిర్దేశించింది. అయితే.. ఇరుపక్షాలూ బహిరంగంగా ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో, మాటలకు, వాస్తవానికి మధ్య ఉన్న అంతరం ఈ సంఘర్షణ ఎలా, ఎప్పుడు ముగుస్తుందనే దానిపై అనిశ్చితిని పెంచుతూనే ఉంది.












Click it and Unblock the Notifications