భారత్-పాకిస్తాన్ సమస్యకు అదే పరిష్కారం ..! తేల్చేసిన పాక్ ప్రధాని..!
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా క్షీణించాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్ధితులు నెలకున్నాయి. అయినా అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల మేరకు పాకిస్తాన్ తో భారత్ ఆసియాకప్ మ్యాచ్ లు ఆడుతోంది. ఇలాంటి సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు.
భారత్-పాక్ మధ్య శాంతి నెలకొనాలంటే ఏం జరగాలో పొరుగు దేశ ప్రధాని షెహబాజ్ వెల్లడించారు. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్దితికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. లండన్‌లో పాకిస్తాన్ జాతీయుల్ని ఉద్దేశించి మాట్లాడిన షరీఫ్.. కాశ్మీర్ సమస్యను ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారతదేశం ప్రయత్నాలు చేయాలని కోరారు.

భారతదేశం, పాకిస్తాన్ పొరుగు దేశాలని, మనం కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. కానీ కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోతే సంబంధాలు సాధారణీకరించబడవన్నారు. కాశ్మీరీల రక్తం వృధా కాదన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా భారతదేశం-పాకిస్తాన్ సంబంధాలు ఏర్పడతాయని ఎవరైనా నమ్మితే, వారు మూర్ఖుల స్వర్గంలో నివసిస్తున్నట్లేనని షరీఫ్ స్పష్టం చేశారు. అలాగే కాశ్మీర్ సమస్యను, గాజా యుద్ధాన్ని ఆయన పోల్చారు.
తాము నాలుగు యుద్ధాలు చేసామని, బిలియన్ డాలర్లు ఖర్చు చేసామని, ఆ నిధులను పాకిస్తాన్ ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. భారతదేశం మంచి పొరుగు దేశంగా ఉండటానికి బదులుగా పోరాట విధానం అవలంబిస్తోందని షరీఫ్ ఆరోపించారు. మనం శాంతియుతంగా జీవించాలా లేదా పోరాటం కొనసాగించాలా అనేది మా ఇష్టం అన్నారు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం, గౌరవించడం ద్వారా జీవించాలనేది తమ కోరికన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తో దిగజారిన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు షరీఫ్ ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications