ట్రంప్ కన్నెర్ర- చక్రబంధంలో బంగ్లాదేశ్..!!
Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్- హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికిపోతోంది. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు.
గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి.

హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగులగొట్టడం, మంటల్లో పడేయడం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది. మహ్మద్ యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు.
ఇస్కాన్ ప్రతినిధి, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జొటె నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్ట్ చేయడం దీనికి పరాకాష్ఠగా మారింది. తమ దేశ జాతీయ పతాకాన్ని అవమానపరిచారనే కారణంతో గత ఏడాది నవంబర్ 25వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. ఢాకా చిత్తోగ్రామ్‌లోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ దేశానికి అందించే అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేస్తోన్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది వైట్‌హౌస్. వర్క్ ఆర్డర్లు సహా అన్ని రకాల కార్యకలాపాలనూ నిలిపివేస్తోన్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ అక్విజిషన్ అండ్ అసిస్టెన్స్ డైరెక్టర్ బ్రియాన్ ఆరోన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టులు, టాస్క్ ఆర్డర్లు, గ్రాంట్లు, కోఆపరేటివ్ అగ్రిమెంట్లు, అక్విజిషన్లు, అసిస్టెన్స్.. అన్నింటినీ వెంటనే నిలిపివేయాలంటూ యూఎస్ ఎయిడ్ ఇంప్లిమెంటింగ్ భాగస్వామ్యులకు లేఖ రాశారు.
లిఖితపూరకంగా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఎలాంటి సహాయ సహకారాలు, వర్క్ ఆర్డర్లు, కాంట్రాక్టులు, ఆతర ఆర్థికపరమైన వ్యవహారాలను పునరుద్ధరించవద్దని ఆదేశించారు. బంగ్లాదేశ్‌తో కొనసాగుతూ వస్తోన్న దౌత్య సంబంధాలు మాత్రం యధాతథంగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications