రష్యాలో విమాన ప్రమాదం: 50మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మాస్కో నుంచి వస్తున్న టాటార్ స్టాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్-737 విమానం కాజన్‌లోని వోల్గాసిటీ విమానాశ్రయంలో రన్ వేను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం ఉన్న 50మంది(44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది) మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 7.25నిమిషాలకు జరిగింది.
రన్ వేకు 500 యార్డుల దూరంలో ఉండగా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఈ ప్రమాదం సంభించినట్లు అధికారులు భావిస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో మూడు సార్లు విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు. అయితే విమానం లాండింగ్ చేసే చివరి ప్రయత్నం విఫలం కావడంతో విమానం రన్ వేను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

ఏదేమైనా వివిధ కారణాల వల్ల ప్రమాదం జరిగిందని రష్యా జాతీయ విచారణ కమిటీ అధికార ప్రతినిధి వ్లాదిమీర్ మార్కిన్ తెలిపారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపం, పైలట్ అసమర్థత, వాతావరణ ప్రతికూలతలతో ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రష్యా యొక్క టాటార్ స్టాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు రుస్టం మిన్నిఖెనోవ్ కుమారుడు ఎరిక్ మిన్నిఖెనోవ్(24) మరణించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ రీజినల్ నిర్వాహకుడు అలెక్జండర్ అంటోనోవ్ కూడా విమాన ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. ప్రమాద కారణాలను అన్వేషించేందుకు ఒక కమిషన్ నియమించాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా కాజన్ ఏవియేషన్ భద్రత చాలా చెత్తగా ఉందని రష్యా రికార్డులలో ఉందని మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు కాజన్‌లో విమాన ప్రమాదాలు సంభవించడం వల్ల సుమారు 150 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications