సంచలన నివేదిక: ట్రంప్ రహస్యాలన్నీ రష్యా చేతుల్లో..
గతేడాది జరిగిన అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపును కాంక్షిస్తూ రష్యా తెరవెనుక ఈ తతంగం నడిపిందని తెలుస్తోంది.
న్యూయార్క్: 'రష్యా ఇంటలిజెన్స్ చేతిలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్యాలు'.. ఇదే వార్త ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. ట్రంప్ కు సంబంధించిన పలు కీలక, వ్యక్తిగత సమాచారం అంతా రష్యా ఇంటలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిందని అమెరికా ఇంటలిజెన్స్ ఓ నివేదిక ఇచ్చింది.
గతేడాది జరిగిన అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపును కాంక్షిస్తూ రష్యా తెరవెనుక ఈ తతంగం నడిపిందని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని, సమాచారం ఇచ్చింది మాత్రం అత్యంత నమ్మకస్తులేనని అమెరికన్ ఇంటలిజెన్స్ పేర్కొంది. వీటి ఆధారంగా సమాచారాన్ని లీక్ చేయడంలో బాధ్యులైన వారికి నోటీసులు కూడా జారీ చేయవచ్చునని ఇంటలిజెన్స్ తెలిపింది.

కాగా, ఈ నివేదికను అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాతో పాటు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంటలిజెన్స్ అందజేసింది. దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తి చేసిన ట్రంప్.. ఇదంతా వట్టి రాజకీయమేనని ఆయన కొట్టిపారేశారు.
FAKE NEWS - A TOTAL POLITICAL WITCH HUNT!
— Donald J. Trump (@realDonaldTrump) January 11, 2017
ఇదే విషయంపై స్పందించిన ఓ సీనియర్ అధికారి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలు మాత్రమే ఉన్నాయని, ఒబామా-ట్రంప్ ఇద్దరికీ సంబంధించిన సమాచారాన్ని రష్యా సేకరించిందని అన్నారు.
అయినప్పటికీ డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కొంత సమాచారాన్ని మాత్రమే రష్యా బయటపెట్టిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలనే ఉద్దేశ్యంతోనే రష్యా ఇంటలిజెన్స్ ఈ చర్యకు పాల్పడిందని తెలిపారు.












Click it and Unblock the Notifications