ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!
ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న నిరసనలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్ లో ఈ నిరసనల వెనుక ఏం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ఈ నిరసనల్ని అడ్డుకునేందుకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. చివరికి ఈ వ్యవహారం అగ్రరాజ్యం అమెరికాలోనూ (US) ప్రస్తావనకు వస్తోంది. దీంతో ట్రంప్ సర్కార్ పైనా ఒత్తిడి పెరుగుతోంది.
భారత్ లో విద్యార్ధుల నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు వ్యవహరిస్తున్న విధానాలను ప్రశ్నించాలనే ఒత్తిడి ట్రంప్ సర్కార్ పై పెరుగుతోంది. తాజాగా ఆరుగురు డెమోక్రాట్ చట్ట సభ సభ్యులు (US Lawmakers) ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పోలీసుల తీరును ప్రస్తావించాలని కోరారు. ఇందులో ప్రమీలా జయపాల్, ఒమర్, జిమ్ మెక్‌గవర్న్, రషీదా త్లాయిబ్, ఎలియనోర్ హోమ్స్ నార్టన్, జీసస్ గార్సియా వంటి అమెరికా డెమోక్రటిక్ చట్టసభ్యులు ఉన్నారు. వీరు ఢిల్లీతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విద్యార్థుల నిరసనల సందర్భంగా అదనపు బలప్రయోగంపై ఆందోళన వ్యక్తం చేయాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కోరారు. ఈ మేరకు వారు రూబియోకు లేఖ రాశారు.

వచ్చే వారం రూబియో భారత పర్యటన నేపథ్యంలో వారు ఈ లేఖ రాశారు. ఈ పర్యటనలో రూబియో ముంబైలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశం కానున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుగా నిరసనలు చేస్తున్న వారిని పర్యవేక్షించడానికి వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇతర అమెరికా నగరాల్లోని కాన్సులేట్లు ఫోటోగ్రాఫర్లను నియమించాయని కూడా వారు ఆరోపించారు. ఢిల్లీ, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా దళాలు అణచివేత, అక్రమ నిర్బంధం, మితిమీరిన బలప్రయోగం వంటి పద్ధతులపై తాము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నామని వారు తెలిపారు. నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం జరిగిందనడానికి ఉదాహరణలుగా, అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేసిన నిరసనలను, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ జరుగుతున్న ప్రదర్శనలను చట్టసభ సభ్యులు ఉదహరించారు. అలాగే భారతదేశ ముసాయిదా ఓటర్ల జాబితాల నుండి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడాన్నీ ప్రమీలా జయపాల్ ప్రశ్నిస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు.














Click it and Unblock the Notifications
