"మేం కూడా ధర్నాకు దిగుతాం"- కేంద్రానికి సుప్రీంకోర్టు అసాధారణ హెచ్చరిక..!
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా ఓ అసాధారణ హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు తామూ ధర్నాకు దిగుతామంటూ హెచ్చరించింది. అయితే ఈ ధర్నా హెచ్చరిక వెనుక ఉన్న కారణం మాత్రం వేరు. ఢిల్లీ హైకోర్టు సమీపంలో సరైన ఫుట్పాత్, పాదచారుల క్రాసింగ్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్ధానం.. ఈ అసాధారణ హెచ్చరిక జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టు వద్ద పాదచారుల కోసం మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమవడంపై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేవలం కమిటీలను ఏర్పాటు చేయడం సరిపోదని, క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ తేదీకి ముందు ఈ సమస్య పరిష్కారం కాకపోతే, తమ న్యాయమూర్తులు కోర్టు ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) విక్రమ్జిత్ బెనర్జీని ఉద్దేశించి సుప్రీం న్యాయమూర్తులు ఈ హెచ్చరిక సరదాగా చేసినట్లు తెలుస్తోంది. పనులు పూర్తయ్యే వరకు తాము ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టబోమని సుప్రీం న్యాయమూర్తులు తెలిపారు.

"తదుపరి విచారణ తేదీలోగా మీరు ఫుట్ పాత్ పని పూర్తి చేయకపోతే, మేమిద్దరం (జడ్డీలు) ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్దకు వస్తాము, మీరు ఆ పని పూర్తి చేసే వరకు మేము ఇంటికి వెళ్ళము. అది ఖాయం. ధర్నా చేయడానికి అక్కడే కూర్చుంటాము" అంటూ జడ్డీలు వ్యాఖ్యానించారు. ఇకపై ఆలస్యాన్ని అంగీకరించబోమని, అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా పిలిపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. జీవించే హక్కుకు హామీ ఇచ్చే ఆర్టికల్ 21, సంచార స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు అందుబాటులో ఉండటం ఒక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రోడ్లపై ఆక్రమణలు లేకుండా, సురక్షితమైన, స్పష్టంగా గుర్తించబడిన ఫుట్పాత్లు ఉండేలా చూడాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications
