భారత్ కు బిగ్ రిలీఫ్- మాఫీ: విచక్షణాధికారాలను ఉపయోగించిన డొనాల్డ్ ట్రంప్
రష్యా నుంచి ముడిచమురు, సహజవాయువును దిగుమతి చేసుకునే దేశాలపై అత్యంత భారీ స్థాయిలో టారిఫ్లు విధించేందుకు ఉద్దేశించిన నిబంధనల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా మినహాయింపు ప్రకటించారు. వాటన్నింటినీ మాఫీ చేశారు. దీనివల్ల భారత్, చైనా వంటి ప్రధాన ఆసియా దేశాలపై పడాల్సిన దాదాపు 100 శాతం వరకు పన్నుల భారం ప్రస్తుతానికి తప్పినట్టయింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఓ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను ఇచ్చారు ట్రంప్.
యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ లోని కొన్ని కఠిన నిబంధనల అమలుకు మినహాయింపు ఇస్తూ ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీయడం, ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నెరపే ఇతర దేశాలపై ఆర్థిక ఆంక్షలు మోపేలా ఈ చట్టం.. అధ్యక్షుడికి విస్తృత అధికారాలు కల్పించింది. ఈ అయిదు దేశాల జాబితాలో భారత్, చైనా, టర్కీ, అజర్ బైజాన్, హంగేరి ఉన్నాయి.

వీటి తర్వాతి స్థానం.. సింగపూర్, స్లొవాక్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్. ఈ టారిఫ్ అమలు, నిబంధనల సడలింపు విషయంలో ట్రంప్కు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ దేశంపై ఎంత పన్ను విధించాలనేది పూర్తిగా ఆయన విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అదే విచక్షణాధికారాల ఆధారంగా భారత్ సహా ఆయా దేశాలపై తాత్కాలికంగా ఈ పన్ను సడలింపులను ప్రకటించారు. దీనివల్ల రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసే భారత్, చైనా, స్లొవేకియా, హంగేరీ, అజర్బైజాన్ కు ఎటువంటి అదనపు టారిఫ్ వర్తించదు.
ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అమెరికా స్వదేశీ ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షల నుంచి ఉపశమనం ఇవ్వడమే సరైన మార్గమని భావించినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ అయిదు దేశాలతో తమకున్న అంతర్జాతీయ వ్యూహాత్మక, ఆర్థిక, ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే ఈ వెసులుబాటు కల్పించినట్లు వైట్ హౌస్ తెలిపింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్ వైఖరిలో కనిపిస్తోన్న ఈ మార్పు అంతర్జాతీయంగా చర్చనీయాంశమౌతోంది. ఒకవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ అనుసరిస్తున్న సైనిక విధానాలపై బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పించడం, మరోవైపు రష్యన్ ఇంధన వాణిజ్యంపై ఆంక్షలను సడలించడం ట్రంప్ నూతన విదేశాంగ వ్యూహానికి అద్దం పట్టినట్టయింది.
2022లో ఫిబ్రవరిలో ఉక్రెయిన్ తో యుద్ధం ఆరంభమైన ప్రారంభ రోజుల నుంచే రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.. భారత్. తన దేశీయ ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు, రూపాయి విలువ స్థిరత్వానికి సానుకూల అంశంగా మారనుంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ సమతుల్యతలో భాగంగా అమెరికా తన మిత్రదేశాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ముందడుగు వేసినట్లు స్పష్టమవుతోంది.













Click it and Unblock the Notifications
