ISRO: గగన్‌యాన్ మోడ్యూల్ సెపరేషన్ టెస్ట్ సక్సెస్..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 'గగన్‌యాన్' దిశగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన క్రూ మోడ్యూల్ (వ్యోమగాములు ఉండే క్యాబిన్), సర్వీస్ మోడ్యూల్ వేరుపడే ప్రక్రియకు సంబంధించిన పరీక్షలను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. 2026 సంవత్సరంలో చేపట్టనున్న తొలి మానవరహిత 'జి-1' (G1) ప్రయోగానికి ముందు, ఈ సెపరేషన్ సిస్టమ్ పనితీరును అంచనా వేయడంలో ఈ పరీక్షలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అసలేంటీ గగన్‌యాన్ ఆర్బిటాల్ మోడ్యూల్?
గగన్‌యాన్ ఆర్బిటాల్ మోడ్యూల్‌లో ప్రధానంగా క్రూ మోడ్యూల్, సర్వీస్ మోడ్యూల్ అనే రెండు భాగాలు ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన సెపరేషన్ సిస్టమ్ ద్వారా లింక్ చేసి ఉంటాయి. రాకెట్ ప్రయోగించే సమయానికి ముందే ఈ రెండు మాడ్యూల్స్‌ను అనుసంధానిస్తారు. అంతరిక్ష కక్ష్యలో ప్రయాణం ముగిసే వరకు ఇవి ఒకే యూనిట్‌గా పనిచేస్తాయి. అయితే వ్యోమగాములు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో, క్రూ మోడ్యూల్ నుంచి సర్వీస్ మోడ్యూల్ వేరుపడాల్సి ఉంటుంది. పైరోటెక్నిక్ పరికరాలు, జెటిసనింగ్ వ్యవస్థల ద్వారా ఈ వేరుపడే ప్రక్రియ అత్యంత కచ్చితంగా జరుగుతుంది.

తిరువనంతపురం వేదికగా కఠిన పరీక్షలు
ఈ సెపరేషన్ సిస్టమ్ డిజైన్‌ను పూర్తిగా పరీక్షించి నిర్ధారించుకునేందుకు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఇస్రో ఈ పరీక్షలను నిర్వహించింది. క్రూ మోడ్యూల్, సర్వీస్ మోడ్యూల్ అనుసంధానాన్ని పోలిన ప్రత్యేక సెటప్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రయోగాలు చేపట్టారు. ఈ పరీక్షల సమయంలో రెండు మాడ్యూళ్ల మధ్య ఉన్న పలు ఎలక్ట్రికల్, ఫ్లూయిడ్ అంబినికల్ కనెక్షన్లను విజయవంతంగా వేరు చేశారు.
కీలక వ్యవస్థల పనితీరు భేష్
ఈ పరీక్షల ద్వారా కేవలం మాడ్యూల్స్ వేరుపడటమే కాకుండా, క్రూ మోడ్యూల్లోని అత్యంత కీలకమైన సబ్‌సిస్టమ్స్ పనితీరు, షాక్‌లను తట్టుకునే సామర్థ్యం అద్భుతంగా ఉన్నట్లు ఇస్రో తేల్చింది. ఏవియానిక్స్ సిస్టమ్స్, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్స్, థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ పరికరాలు ఈ పరీక్షలో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసినట్లు నిర్ధారించారు. ఈ విజయంతో 2026లో జరగబోయే తొలి మానవరహిత గగన్‌యాన్ 'జి-1' ప్రయోగంపై ఇస్రోలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.














Click it and Unblock the Notifications
