రైల్లో కత్తులతో విచక్షణారహితంగా ప్రయాణికులపై దాడి.. 9మంది పరిస్థితి విషమం!
బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ షైర్ లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. లండన్ నుండి హంటింగ్ డన్ వెళ్తున్న ఒక రైలులో కొందరు దుండగులు ప్రయాణికులపైన విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా, వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులు వెల్లడించారు. ఇక ఈ దాడి వివరాల్లోకి వెళితే
లండన్ రైలులో బీభత్సం.. ఆర్తనాదాలు చేసిన ప్రయాణికులు
లండన్ నుండి హంటింగ్ డన్ కు రైలు బయలుదేరింది. లండన్ నుండి సుమారు 75 మైళ్ళ దూరంలో ఉన్న హంటింగ్ డన్ సమీపంలో శనివారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో దుండగులు విచక్షణారహితంగా రైల్వే కంపార్ట్మెంట్లలో విరుచుకుపడ్డారు. కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా ప్రయాణికులంతా ఆర్తనాదాలు చేశారు. భయాందోళనలతో వణికిపోయారు. ఇక ఈ దాడితో ఒక ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు.

ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసి దర్యాప్తు
కేంబ్రిడ్జ్ షైర్ పోలీసులు వేగంగా స్పందించి హంటింగ్ డన్ స్టేషన్లో రైలును ఆపి, దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన పైన బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ కీలక ప్రకటన చేసింది. ఈ దారుణ ఘటనలో గాయపడిన పదిమందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, వీరిలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయని వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బి టి పి ప్రకటించింది.
దాడికి కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు
ఈ దర్యాప్తులో కౌంటర్ టెర్రరిజం పోలీస్ విభాగం కూడా పాలుపంచుకుంటున్నదని, btp వెల్లడించింది. బి టి పి చీఫ్ సూపరింటెండెంట్ క్రిస్ కేసి ఈ ఘటనను అత్యంత షాకింగ్ అని పేర్కొన్నారు. గాయపడిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ ఘటన వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని, తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కత్తిపోట్ల ఘటనతో సామాన్యులకు వెన్నులో వణుకు
తాజా షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రహదారులను మూసివేసి ఆ ప్రాంతంలో తాత్కాలికంగా రైల్వే సర్వీసులను నిలిపివేశారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బి టి పి అధికారులు చెబుతున్నారు. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపైన కత్తి పోట్ల ఘటన అటు సామాన్య ప్రయాణికులకు కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది.












Click it and Unblock the Notifications