వివాదంలో ట్రంప్ అల్లుడు: రష్యాతో రహస్య ఒప్పందం? అమెరికాలో రేగుతోన్న దుమారం..
రష్యాతో రహస్య కమ్యూనికేషన్ ఛానల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెద్ కుష్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వాషింగ్టన్: రష్యాతో రహస్య కమ్యూనికేషన్ ఛానల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెద్ కుష్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ ఛానెల్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి.
అధ్యక్ష ఎన్నికల సమయంలో సైబర్ హ్యాకింగ్ కు పాల్పడి ట్రంప్ కు రష్యా పరోక్షంగా సహకరించిందని ఇప్పటికే పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాతో ట్రంప్ అల్లుడి వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారుతోంది. ట్రంప్ గెలుపొందిన తర్వాత అమెరికాలోని రష్యా రాయబారి సెర్గీ కిస్ల్ యాక్ తో కుష్నర్ సమావేశం అవడం ఈ ఆరోపణలకు తావిచ్చింది.

ఆ సమయంలో ఇరు దేశాల మధ్య ఓ రహస్య కమ్యూనికేషన్ ఛానల్‌ను ఏర్పాటుచేయాలని కుష్నర్ ఆ రాయబారితో చర్చించారని అమెరికన్ మీడియా వ్యాఖ్యానించింది. కుష్నర్‌తో పాటు ఈ సమావేశంలో ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ ఫ్లైన్ కూడా హాజరైనట్లు చెబుతున్నారు.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఈ సమావేశం గురించి ఈ ఏడాది మార్చి నెలలో వైట్ హౌజ్ ప్రకటన చేయడం గమనార్హం. ఇన్నాళ్లు ఈ భేటీని ఎందుకు గోప్యంగా ఉంచారన్న దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా దీనిపై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఆరోపణలతో కుష్నర్ ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష డెమోక్రటిక్ డిమాండ్ చేస్తోంది.
కుష్నర్ ప్రతిపాదనకు రష్యా కూడా సానుకూలంగా స్పందించిందని అమెరికా మీడియా చెప్పుకొచ్చింది. కాగా, ట్రంప్ కుమార్తె మెలానియా భర్త అయిన కుష్నర్.. ప్రస్తుతం వైట్ హౌజ్ లో సీనియర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసందే.












Click it and Unblock the Notifications