శవాలదిబ్బలుగా టర్కీ,సిరియా -5వేలు దాటిపోయిన మృతులు-3నెలలు ఎమర్జెన్సీ ప్రకటన
భూకంపం బారిన పడిన టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 5 వేలు దాటిపోయింది. ఇరుదేశాల్లోనూ ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. క్షతగాత్రుల హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 3 నెలల పాటు అత్యవసర పరిస్ధితి విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
టర్కీ, సిరియాలో సహాయక చర్యల కోసం 14 దేశాలకు చెందిన 3 వేలకు పైగా బృందాలు చేరుకున్నాయి. వీరిని హటే, కహ్రామన్‌మరాస్, అడియామాన్ ప్రావిన్స్‌లతో పాటు అత్యంత దెబ్బతిన్న రాష్ట్రాలకు పంపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, మాల్టా, నెదర్లాండ్స్, ఇండియా, పోలాండ్, అల్జీరియా, ఇటలీ, మోల్డోవా, అల్బేనియా, ఇజ్రాయెల్, ఉజ్బెకిస్తాన్, హంగేరీ, జర్మనీ, సెర్బియా, స్లోవేకియా, ఖతార్, బ్రిటన్, రష్యా దేశాలున్నాయి. ప్రభుత్వం దాదాపు 3 లక్షల 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరోవైపు ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో టర్కీ, సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని వారసత్వ ప్రదేశాలకు నష్టంపై ప్రాథమిక సర్వే నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలను భద్రపరచడానికి ఇరుదేశాలకు సాయం చేసేందుకు యునెస్కో ప్రయత్నిస్తోంది. సిరియాలోని పురాతన నగరమైన అలెప్పోలో పరిస్థితిపై ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నట్లు యునెస్కో తెలిపింది.












Click it and Unblock the Notifications