US Midterm Elections 2026: డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ ట్రబుల్.. అమెరికాలో బ్లూ వేవ్!
US Midterm Elections 2026: అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోరు తీవ్ర రూపం దాల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల పాలనకు, ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు ఈ ఎన్నికలు ఓ రకంగా ప్రజా తీర్పుగా మారాయి. యూఎస్ కాంగ్రెస్‌లోని ఎగువ సభ 'సెనెట్', దిగువ సభ 'హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)పై పార్టీ ఆధిపత్యం సాధిస్తుందనేది రాబోయే రెండేళ్ల అమెరికా రాజకీయ దిశను, క్యాపిటల్ హిల్ పర్యవేక్షణను నిర్దేశించనుంది.
నానాటికి పడిపోతున్న ట్రంప్ ప్రజాదరణ
ప్రస్తుతం అమెరికన్లను వేధిస్తున్న తీవ్ర ద్రవ్యోల్బణం, పెరిగిన హెల్త్‌కేర్, నిత్యావసరాలు, ఇంధన ధరలు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారాయి. వీటితో పాటు ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం ప్రజల్లో మరింత అసంతృప్తిని పెంచింది. ఎన్నికల సర్వేల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ 'జాబ్ అప్రూవల్ రేటింగ్' కేవలం 39 శాతానికి పడిపోగా.. దాదాపు 61 శాతం మంది ప్రజలు ఆయన పనితీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి రిపబ్లికన్ పార్టీకి రెండు సభల్లోనూ ఆధిక్యాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.

డెమోక్రాట్ల బ్లూ వేవ్ గాలులు
మరోవైపు ప్రతిపక్ష డెమోక్రాట్లకు అనుకూలంగా బ్లూ వేవ్ వీస్తోందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు ఏకంగా 250 వరకు స్థానాలు దక్కవచ్చని, సెనెట్‌లోనూ వారి బలం 53 నుంచి 54 స్థానాలకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే పోలింగ్ సర్వేలలో సైలెంట్ ఓటర్లుగా ఉండే రిపబ్లికన్లు ఓటింగ్ రోజున ఎలాంటి తుది తీర్పు ఇస్తారనేది వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిపబ్లికన్ల బలాలు-బలహీనతలు
రిపబ్లికన్ పార్టీకి వారి అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానం, బిజినెస్ ఫ్రెండ్లీ నిర్ణయాలు, ట్రంప్ కరడుగట్టిన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' మద్దతుదారులు ప్రధాన బలంగా ఉన్నారు. అయితే జో బైడెన్ హయాంలో మొదలై ప్రస్తుతం మరింత పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోవడం, ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా సాగడం వారి అతిపెద్ద బలహీనతగా మారింది. డెమోక్రాట్లకుఈ వ్యతిరేకత కలసివస్తున్నప్పటికీ.. తమ మద్ధతుదారులను భారీ సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలకు రప్పించడమే వారికి ప్రధాన సవాలు.
ఫలితాలు మారితే ట్రంప్ అధికారానికి గండి పడుతుందా?
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓటమి పాలైనా ట్రంప్ తన వైట్‌హౌస్ పీఠాన్ని కోల్పోరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం విదేశాంగ విధానం, టారిఫ్‌లు, వ్యాపార ఒప్పందాలు, సైనిక చర్యలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా అధ్యక్షుడికే పూర్తి అధికారాలు ఉంటాయి. కానీ దేశీయంగా కొత్త చట్టాలు చేయడం, పన్ను సవరణలు, బడ్జెట్ ఆమోదింపజేసుకోవడం వంటి విషయాల్లో డెమోక్రాట్లపై ఆధారపడక తప్పదు. కాంగ్రెస పర్యవేక్షణ పెరగడం వల్ల ట్రంప్ తన రెండో విడత పాలనలో తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు.














Click it and Unblock the Notifications
