వచ్చే ఆరు గంటలు కీలకం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
మురుసు తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కుండపోత కొనసాగుతోంది. ప్రభుత్వం అప్రమత్తం అయింది. అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేస్తోంది. మురసు తుఫాన్ ప్రభావం, ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు నిర్దేశం చేశారు.
తుఫాను కారణంగా ప్రస్తుతం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.. సమస్యల పైన సీఎం చంద్రబాబు అధికారుల తో ఆరా తీసారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడడం ప్రథమ ప్రాధాన్యమన్నారు. ప్రజలు తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రభుత్వ సూచనలు పాటించాలని తెలిపారు. చివరి వ్యక్తికీ సహాయం అందే వరకు యంత్రాంగం విశ్రమించవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈరోజు రాత్రికి తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గే అవకాశం ఉందని సీఎం అన్నారు. ప్రకాశం, బాపట్లలో వర్షపాతం మరింత పెరిగిందని.. వచ్చే 4 నుంచి 5 గంటలు కీలకమని వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయన్నారు. 21 పట్టణ ప్రాంతాల్లో ఎక్కువుగా వర్షపాతం నమోదవుతోందని తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం
అదే విధంగా మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేసి... క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న రాత్రి వర్షం పడినప్పటికీ ఈరోజు సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. చెరువులు, రిజర్వాయర్లు, వాగులు ఏవీ ప్రమాదకర స్థాయిలో లేకున్నా... నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం నీరు వృధా కాకుండా సమర్ధనీటి నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రకాశం, బాపట్ల జిల్లాలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలన్నారు. తుఫాన్ సమయంలో అధికారుల నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ అద్భుతంగా పనిచేశారని ప్రశంసిచారు. ఒంగోలు లో పలుచోట్ల పడిపోయిన చెట్లను వెంటనే క్లియర్ చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. గుంటూరు జిల్లాలో పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని సీఎంకు అధికారులు తెలియజేశారు.













Click it and Unblock the Notifications
