Budameru Flood: విజయవాడకు మళ్లీ బుడమేరు ముప్పు-ప్రజల్ని అలర్ట్ చేస్తున్న అధికారులు..!
రెండేళ్ల క్రితం విజయవాడలోని బుడమేరుకు వచ్చిన వరదలు (Budameru Flood) చరిత్రలో నిలిచిపోయాయి. పైనున్న తెలంగాణ నుంచి వస్తున్న వరద ప్రవాహాలకు తోడు, మురసు తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి బుడమేరకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు.
విజయవాడలో అప్పట్లో వచ్చిన బుడమేరు వరదలకు పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. దానికి మించి వారాల పాటు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. బుడ మేరుకు వచ్చిన వరద నీటిని ఎటు పంపాలో తెలియక అధికారులు సతమతం అయ్యారు. చివరికి ఎలాగోలా నీటిని తోడి ఊరట కల్పించారు. అయినా అప్పట్లో వచ్చిన వరదలకు జనం పడ్డ ఇబ్బందులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి బుడమేరు వరద పేరు చెబితేనే జనం ఉలిక్కి పడే పరిస్ధితి బెజవాడలో కనిపిస్తోంది.

ప్రస్తుతం మురసు తుఫాన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటిపోయినా మరో రెండు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. దీంతో విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీంతో అధికారులు స్థానికంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బుడమేరు వరదల్ని వారికి గుర్తుచేస్తూ, అప్రమత్తంగా ఉండాలని, వరద వచ్చే పరిస్ధితి ఉంటే ఇంట్లోనే ఉండిపోకుండా, పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు సిద్దంగా ఉండాలని ఇంటింటికీ వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో జనం అలర్ట్ అవుతున్నారు.













Click it and Unblock the Notifications
