వైసీపీ ఖాతాలో తొలి మున్సిపాల్టీ, ఆ స్థానాల్లో హోరా హోరీ..!!
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల్లో కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు దాదాపు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీ కొన్ని చోట్ల మాత్రమే బలం నిరూపించుకుంటోంది. పార్టీకి బలమైన ప్రాంతాల్లోనూ వెనుకబడి ఉంది. కాగా.. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి తొలి విజయం దాదాపు ఖాయమైంది. కర్నూలు జిల్లా మున్సిపాల్టీ వైసీపీ ఖాతాలో జమ అయింది. మరి కొన్ని చోట్ల హోరా హోరీ పోటీ ఇస్తోంది. దీంతో.. తుది ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో తొలి నుంచి కూటమి పార్టీల ఆధిక్యత కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి ఆధిక్యత వచ్చినా.. బ్యాలెట్ లెక్కింపు తరువాత దాదాపుగా 90 శాతం స్థానాల్లో కూటమి అభ్యర్ధులే ముందంజలో ఉన్నారు. మొత్తం 13 కార్పోరేషన్లలో కూటమి పార్టీలు లీడ్ లో ఉన్నారు. మున్సిపాల్టీల్లో 44 టీడీపీ, 15 జనసేన, 3 బీజేపీ లీడ్ లో ఉండగా.. వైసీపీ నాలుగు స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. కాగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ 32 వార్డులకు గానూ 22 గెలుచుకుంది. టీడీపీ ఎనిమిది వార్డుల్లో విజయం సాధించింది. మొదట పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ స్వల్ప ఆధిక్యం చూపినప్పటికీ, ఈవీఎం ఓట్ల లెక్కింపు తర్వాత వైసీపీ తన పట్టు నిరూపించుకుంది. దీంతో, ఈ మున్సిపాల్టీ ఛైర్మన్ అభ్యర్ది లీడ్ లో కొనసాగుతుండటం తో ఈ సీటు వైసీపీకి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తుది ఫలితం వెల్లడి కావాల్సి ఉంది.

సాయంత్రానికి తుది ఫలితాలు
ఇదే జిల్లాలో మాజీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాద్ రెడ్డి నియోజకవర్గం డోన్ లోనూ ఫలితం ఆసక్తిగా మారుతోంది. డోన్‌లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ గా కొనసాగుతోంది. ఇక్కడ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరరకు టీడీపీ 5, వైసీపీ 4 వార్డుల్లో ఆధిక్యం లో ఉన్నాయి. ఇక, తుని మున్సిపాల్టీలోనూ గట్టి పోటీ నెలకొంది. తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి పిట్ల రామతులసి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా.. కార్పోరేషన్ల మేయర్ ఎన్నికల్లో దాదాపుగా అన్నింటా కూటమి అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు. విజయవాడ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అయింది. ఇంకా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అనంత మేయర్ ఓట్ల లెక్కింపు ఆలస్యం జరుగుతోంది. ఈ సాయంత్రానికి ఫలితాల పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
