US Midterm Elections: ఈవీఎంలు లేవు.. పేపర్ బ్యాలెట్లే! అయినా గంటల్లోనే ఫలితాలు ఎలా?
US Midterm Elections: భారత్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు అనగానే మనకు ఈవీఎంలు గుర్తుకొస్తాయి. బటన్ నొక్కడం ద్వారా ఓటు వేయడం, కౌంటింగ్ రోజున అతి తక్కువ సమయంలో ఫలితాలు వెల్లడించడం ఇక్కడ సాధారణం. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో విధానం భిన్నంగా ఉంటుంది. అక్కడ మెజారిటీ ఓటర్లు డిజిటల్ ఈవీఎంలతో కాకుండా సంప్రదాయ 'పేపర్ బ్యాలెట్' ద్వారానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయినప్పటికీ దాదాపు 10 కోట్లకు పైగా పడే ఓట్లను అక్కడ కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే లెక్కించి విజేతలను ఎలా ప్రకటిస్తారు? అసలు అమెరికా ఓటింగ్ కౌంటింగ్ వెనుక ఉన్న అసలు టెక్నాలజీ ఏమిటి?
పేపర్ బ్యాలెట్లే.. కానీ కౌంటింగ్ అంతా డిజిటల్ స్కానర్లతో!
భారత్‌లోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరిగితే, అధికారులే ఒక్కో కాగితాన్ని పట్టుకుని లెక్కించాల్సి వస్తుంది. కానీ అమెరికాలో ఈ ప్రక్రియ పూర్తిగా వేరు. ఓటర్లు బ్యాలెట్ పేపరుపై తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న గడిలో గుర్తులు పెడతారు. అనంతరం ఆ కాగితాలను అత్యంత వేగంగా పనిచేసే హై-స్పీడ్ స్కానర్ మిషన్లలో వేస్తారు. ఈ డిజిటల్ స్కానర్లు కాగితంపై ఉన్న గుర్తును సెకన్లలో చదివి, సంబంధిత అభ్యర్థి ఖాతాలో ఓటును డిజిటల్‌గా జమ చేస్తాయి. భారీ కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే ఈ యంత్రాలు గంటకు వేలాది ఓట్లను లెక్కించగలవు. యంత్రాలు లెక్కించినప్పటికీ.. అసలైన పేపర్ బ్యాలెట్ భద్రంగా డిపాజిట్ అవుతుంది. ఒకవేళ రీ-కౌంటింగ్ లేదా కోర్టు వివాదాలు వస్తే ఈ పేపర్లను మళ్లీ ప్రత్యక్షంగా తనిఖీ చేసే సౌకర్యం ఉండటం అక్కడ ప్రత్యేకత.

పోలింగ్ రోజుకంటే ముందే సగం పని పూర్తి
అమెరికాలో కౌంటింగ్ వేగంగా జరగడానికి మరో ముఖ్య కారణం అడ్వాన్స్ ఓటింగ్, మెయిల్-ఇన్(తపాలా) ఓటింగ్. పోలింగ్ రోజు కంటే ముందే ఓటర్లు తమ ఓటును వేసే వెసులుబాటు అక్కడ ఉంది. ఉదాహరణకు ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల సమయానికే దాదాపు 5.7 కోట్లకు పైగా ఓటర్లు అడ్వాన్స్‌గా ఓట్లు వేశారు. అమెరికాలోని 43 రాష్ట్రాల్లో పోలింగ్ రోజు కంటే ముందే మెయిల్-ఇన్(తపాలా) ద్వారా వచ్చిన ఓట్లను ఓపెన్ చేయడం, ఓటరు సంతకాన్ని పరిశీలించడం, కవర్లు తొలగించి బ్యాలెట్ పేపర్లను స్కానింగ్‌కు సిద్ధం చేసుకోవడానికి అనుమతి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ముందే స్కాన్ చేసి ఉంచుతారు. కానీ ఫలితాలను మాత్రం పోలింగ్ ముగిసేవరకు రహస్యంగా ఉంచుతారు. దీన వల్ల కౌంటింగ్ రోజున అధికారులకు పని భారీగా తగ్గుతుంది.
10,000 కేంద్రాల్లో ఒకేసారి కౌంటింగ్
అమెరికాలో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిర్వహించదు. అక్కడి స్థానిక కౌంటీలు, నగర పాలక సంస్థలే స్వయంగా నిర్వహిస్తాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల కంటే ఎక్కువ స్థానిక ప్రాంతాల్లో ఒకేసారి వేర్వేరు బృందాలు, స్కానర్లతో ఓట్ల లెక్కింపు చేపడతాయి. అసోసియేటెడ్ ప్రెస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు 4 వేల కంటే ఎక్కువ మంది ప్రతినిధులను రంగంలోకి దించి ఈ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు డేటాను సేకరించి లైవ్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తాయి.
ఫలితాల ప్రకటన ముందే ఎలా?
అన్ని ఓట్లు లెక్కించక ముందే మీడియా సంస్థలు విజేతలను ప్రకటిస్తాయి. ఇది అధికారిక ప్రకటన కాదు. ఉదాహరణకు ఓ అభ్యర్థికి లక్ష ఓట్ల ఆధిక్యం ఉండి, లెక్కించాల్సిన ఓట్లు కేవలం 20 వేలే ఉంటే.. ఆ మిగిలిన ఓట్లు మొత్తం ప్రత్యర్థికి పడినా గెలవడం అసాధ్యం. కాబట్టి మీడియా సంస్థలు ప్రొజెక్టెడ్ విన్నర్‌ను ముందే ప్రకటిస్తాయి. మొత్తానికి అమెరికాలో పేపర్ బ్యాలెట్ విధానం ఉన్నప్పటికీ.. అధునాతన స్కానింగ్ టెక్నాలజీ, ముందస్తు ఓటింగ్ నిర్వహణ, విస్తృతమైన కౌంటింగ్ నెట్వర్క్ కారణంగానే కొద్ది గంటల్లోనే కోట్ల ఓట్ల ఫలితాల ట్రెండ్స్ బయటకు వస్తాయి.














Click it and Unblock the Notifications
