బేఫికర్- ఊపిరి పీల్చుకున్న జో బైడెన్..!!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ ఎన్నికలు సెనెట్, కాంగ్రెస్‌కు సంబంధించినవి. ప్రతి రెండేళ్లకోసారి వీటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికా అధ్యక్షుడి నాలుగేళ్ల పదవీ కాలం మధ్యలో అంటే ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల్లో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పదవీ కాలం రెండేళ్లు పూర్తయినందున ఈ ఎన్నికలను నిర్వహించారు.

అనూహ్య ఫలితాలు..
ఈ మధ్యంతర ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న డెమొక్రాట్ల హవా నడుస్తోంది. డెమొక్రాట్లు తమ పట్టును మరింత పెంచుకున్నారు. సెనెట్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సెనెట్‌లో మొత్తంగా 50 స్థానాలు వారి వశం అయ్యాయి. ఇదివరకు కూడా సెనెట్‌లో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉండేది. మధ్యంతర ఎన్నికల్లో దాన్ని పెంచుకోగలిగారు. ప్రతిపక్షంలో ఉన్న రిపబ్లికన్లు 49 సీట్లకు పరిమితం అయ్యారు. డెమొక్రాట్లకు ఇంకొక్క సీటు గనక లభించాల్సి ఉంది.

నెవడాలో విజయంతో..
కాగా- తాజాగా నెవడాలో నిర్వహించిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన క్యాథరిన్ కోర్టెజ్ మాస్టో విజయం సాధించారు. ఈ స్థానాన్ని ఆమె నిలబెట్టుకున్నారు. 48.7 శాతంతో 4,81,840 ఓట్లు క్యాథరిన్‌కు పోల్ అయ్యాయి. ఆమె సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ క్యాండిడేట్ ఆడమ్ లక్సాల్ట్‌కు 48.2 శాతంతో 4,77,018 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో డెమొక్రాట్ల మెజారిటీ 50కి పెరిగింది. ఇక మిగిలింది జార్జియా ఒక్కట

జార్జియా రిజల్ట్ కోసం..
జార్జియాలో డెమొక్రాట్ల తరఫున సెనెటర్ రాఫెల్ వార్న్‌కాక్, రిపబ్లికన్ అభ్యర్థిగా హెర్కెల్ వాకర్ పోటీలో ఉన్నారు. ఇక్కడ వార్నాక్ విజయం సాధించితే- సెనెట్‌లో డెమొక్రాట్లకు ఉన్న మెజారిటీ మరింత పెరుగుతుంది. 51కి చేరుతుంది. మొత్తం 100 సభ్యులు ఉన్న సెనెట్‌లో ప్రస్తుతం డెమొక్రాట్లకు 50 సీట్లు ఉన్నాయి. 49 స్థానాల వద్ద రిపబ్లికన్లు నిలిచారు. జార్జియాలో రిపబ్లికన్లు గెలిచినా డెమొక్రాట్లతో సమానంగా నిలుస్తుందే తప్ప మెజారిటీ దక్కదు.

బైడెన్ నిర్ణయాలను ఆమోదించినట్టే..
ఇదివరకు మధ్యంతర ఎన్నికలను ఎదుర్కొన్న పెన్సిల్వేనియా, అరిజోనా, కొలరాడో, నెవడా, న్యూ హ్యాంప్‌షైర్‌లల్లో డెమొక్రాట్లే గెలుపొందారు. పెన్సిల్వేనియాలో జాన్ ఫెట్టర్‌మన్, అరిజోనాలో మార్క్ కెల్లీ సెనెటర్లుగా విజయం సాధించారు. ఫ్లోరిడా, నార్త్ కరోలినా, ఓహియో, విస్కాన్సిన్‌లో రిపబ్లికన్లు విజయం సాధించారు. సెనెట్‌లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించడం ద్వారా జో బైడెన్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమెరికన్లు ఆమోదించినట్టే అయింది.












Click it and Unblock the Notifications