చైనా విజిటర్స్ కు షాకిచ్చిన అమెరికా
అమెరికా జాతీయ భద్రతను పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో గూఢచర్యం, మనుషుల అక్రమ రవాణా, ఇతర నేరపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి పూనుకుంది. ఇందులో భాగంగా చైనీయులకు కల్పిస్తోన్న ఫ్రీ వీసా ట్రావెల్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. నార్తర్న్ మరియానా దీవుల పర్యటనకు చైనీయులకు వీలు కల్పించే ఈ విసా ఫ్రీ ట్రావెల్ ను తక్షణమే రద్దు చేస్తోన్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఓ ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ ను విడుదల చేసింది. నార్తర్న్ మరియానా దీవుల ఆర్థిక వ్యవస్థను బలపర్చడం కోసం విదేశీ పర్యాటకుల సందర్శనను ప్రోత్సహించడానికి ఈవీఎస్-టీఏపీ పేరుతో ఓ ప్రత్యేక విధానాన్ని ఇదివరకు అందుబాటులోకి తెచ్చింది.. అమెరికా. దీని ద్వారా చైనీయులు ఎలాంటి వీసా అవసరం లేకుండానే గరిష్టంగా 14 రోజుల పాటు అక్కడ పర్యటించే అవకాశం ఉంది. ఈ ఐలాొండ్ నుంచి గ్వామ్ ఐలండ్ గానీ, అమెరికాలోని ఏ ఇతర ప్రాంతానికైనా వెళ్లడంపై నిషేధం ఉంది.

ఈ విసా ఫ్రీ విధానం వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో 3,000 మందికి పైగా చైనా పౌరులు నార్తర్న్ మరియానా ఐలాండ్ ను సందర్శించారు. అదే సమయంలో సైపాన్ ఐలాండ్ నుంచి గ్వామ్‌కు చైనా పౌరులను అక్రమంగా తరలిస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలా అక్రమంగా వచ్చిన కొందరు చైనీయులు గ్వామ్‌లోని అమెరికా సైనిక స్థావరాల వద్ద పట్టుబడ్డారు. బర్త్ టూరిజం, అక్రమ నగదు మార్పిడి, సైపాన్‌లోని కేసినో నిర్వాహకులతో చట్టవిరుద్ధ లావాదేవీలకు పాల్పడినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ గుర్తించింది.
దీంతో చైనీయులకు నార్తర్న్ మరియానా ఐలాండ్ ను సందర్శించడానికి ఉద్దేశించిన విసా ఫ్రీ ట్రావెల్ ను తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త ఆంక్షలు.. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే ప్రయాణ అనుమతులు పొందిన చైనా పౌరులకు కూడా వర్తిస్తుంది. భవిష్యత్తులో చైనా నుంచి ఈ మరియానా ఐలాండ్స్ సందర్శించాలనుకునే ప్రతీ పౌరుడు అమెరికన్ ఎంబసీ ద్వారా వీసాను పొందాల్సి ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ పునరుద్ధరణపై ఎలాంటి స్పష్టమైన కాలపరిమితిని అమెరికా ప్రభుత్వం విధించలేదు. విదేశాంగ శాఖ, హోమ్ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ విధానంపై తదుపరి సమీక్ష నిర్వహిస్తామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా సైనిక కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలు మెరుగుపడేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగే అవకాశాలు లేకపోలేదు.













Click it and Unblock the Notifications
