భార్య ఉష మత మార్పిడిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ క్లారిటీ..!
అమెరికాలో ట్రంప్ సర్కార్ దూకుడుతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హిందూ భార్య ఉషా వాన్స్ మత మార్పిడి వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్ష పీఠంపై కన్నేసిన జేడీ వాన్స్.. అవసరమైతే తన భార్య ఉష మతం మార్చుకుంటుందనేలా పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికన్లు దీన్ని స్వాగతించగా.. భారతీయులు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తన మతాంతర వివాహం గురించి వ్యాఖ్యలపై ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన భార్య ఉష మత విశ్వాసాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఉష హిందువు అని, క్రైస్తవ మతంలోకి మారే ఆలోచన లేదని ఆయన తేల్చేశారు. ఉష క్రైస్తవ మతాన్ని స్వీకరించవచ్చంటూ తాజాగా ఓ కాలేజ్ సమావేశంలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఓ ఈవెంట్ లో భారత సంతతికి చెందిన ఒక విద్యార్థి వలసలు, మతం పట్ల వాన్స్ కఠినమైన వైఖరికీ, అతని హిందూ భార్య ఉషతో సంబంధానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రశ్నించాడు. మీ పిల్లలకు మీ మతాన్ని వారి తల్లి మతం కంటే ముందు ఉంచవద్దని మీరు ఎలా చెప్తున్నారని వాన్స్ ను అడిగాడు. 2019లో కాథలిక్కుగా మారడానికి ముందు సువార్తిక ప్రొటెస్టంట్ నేపథ్యంలో పెరిగిన వాన్స్, తాను, ఉష కలిసినప్పుడు నాస్తికులుగా ఉన్నట్లు గుర్తుచేశారు.

అక్కడితో ఆగకుండా ఆదివారాల్లో ఉష తనతో పాటు చర్చికి వస్తుందని జేడీ వాన్స్ తెలిపారు. చర్చి తనను ఎలా కదిలించిందో, అలాగే ఆమెను కూడా కదిలిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తాను అలా కోరుకుంటున్నానన్నారు. ఎందుకంటే తాను క్రైస్తవ సువార్తను నమ్ముతాననన్నారు. చివరికి తన భార్య కూడా అదే విధంగా భావిస్తుందని తాను ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ తేల్చేశారు. తద్వారా తన భార్య తన కోసం మతం మారుతుందని జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications