13,000 విమానాలు రద్దు.. 14 కోట్ల మందికి హెచ్చరికలు!
అగ్రరాజ్యం అమెరికాను భారీ మంచు తుపాను చిగురుటాకులా వణికిస్తోంది. శనివారం ప్రారంభమైన ఈ మహా విపత్తు దేశవ్యాప్తంగా జనజీవనాన్ని స్తంభింపజేసింది. ప్రమాదకరమైన మంచు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు సుమారు 13 వేల విమానాలు రద్దు కాగా.. కోట్లాది మంది అంధకారంలో చిక్కుకున్నారు.
ఎమర్జెన్సీ విధింపు
న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 140 మిలియన్ల మందికి (అమెరికా జనాభాలో 40శాతం) పైగా మంచు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా 13,000 విమానాలను రద్దు చేసినట్లు ఫ్లైట్ అవేర్ (FlightAware) సంస్థ తెలిపింది. ఓక్లహోమా, డల్లాస్, చికాగో, అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో భారీగా మంచు పేరుకుపోవడంతో విద్యుత్ లైన్లు తెగిపోయాయి. సుమారు 1.20 లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే డజనుకు పైగా రాష్ట్రాల్లో అత్యవసర స్థితిని (Emergency Declarations) ప్రకటించారు. అత్యవసర సహాయక బృందాలను సిద్ధం చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు.
గడ్డకట్టే చలి.. ప్రమాదకర పరిస్థితులు
వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. గాలి వేగం, మంచు తీవ్రత వల్ల ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వస్తే కేవలం 10 నిమిషాల్లోనే 'ఫ్రాస్ట్‌బైట్' (చర్మం గడ్డకట్టడం) అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. "ఇది మేము గత కొన్నేళ్లుగా చూడని అతిపెద్ద తుపాను. దయచేసి ఎవరూ అనవసరంగా బయటకు రావద్దు, ఇంట్లోనే సురక్షితంగా ఉండండి," అని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విద్యాసంస్థలు మూసివేత
తుపాను ప్రభావంతో ఫిలడెల్ఫియా, హ్యూస్టన్ వంటి నగరాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నార్త్ కరోలినా, మిస్సిసిపీ విశ్వవిద్యాలయాలు కూడా తరగతులను రద్దు చేశాయి. మంచు విపరీతంగా కురుస్తుండటంతో రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించారు.












Click it and Unblock the Notifications