రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి పుతిన్- స్టాలిన్ రికార్డు బ్రేక్ ! నాటోకు వార్నింగ్..!
రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి వ్లాదిమీర్ పుతిన్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్ధుల్ని చిత్తు చేసి మరోసారి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇప్పటికే దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల్ని అణిచివేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న పుతిన్.. ఈసారి 88 శాతం ఓటర్ల మద్దతుతో ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తద్వారా రష్యా దిగ్గజ నేత స్టాలిన్ రికార్డును కూడా బ్రేక్ చేశారు.
ఇప్పటికే నాలుగుసార్లు అంటే 24 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగిన వ్లాదిమీర్ పుతిన్.. ఐదోసారి జయకేతనం ఎగురవేశారు. పుతిన్ కు వ్యతిరేకంగా ఈసారి ఓటింగ్ లో భారీ ఎత్తున పాల్గొనాలంటూ గతంలో ఆయన ప్రత్యర్ధి నావెల్నీ ఇచ్చిన పిలుపు మేరకు భారీగా ఓటింగ్ కూడా నమోదైంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున హింస చోటు చేసుకుంది. బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుతో పాటు పలు ద్రావణాలు పోయడం, దాడులకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఎన్నికల తర్వాత తాజాగా ఫలితాలు వెలువడ్డాయి.

పోల్‌స్టర్ పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో పుతిన్ 87.8% ఓట్లను సాధించారని, ఇది సోవియట్ అనంతర రష్యా చరిత్రలో అత్యుత్తమ ఫలితమని తెలిపింది. కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ కేవలం 4 శాతం కంటే తక్కువ ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం కొత్త అభ్యర్ధి వ్లాడిస్లావ్ దావన్‌కోవ్ మూడవ స్థానంలో , అల్ట్రా-నేషనలిస్ట్ లియోనిడ్ స్లట్స్కీ నాల్గవ స్థానంలో నిలిచారు.
వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత పుతిన్.. అంతర్జాతీయంగా తమ ప్రత్యర్ధులపై ఘాటు విమర్శలు చేశారు. రష్యాకూ, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికీ మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్ కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యల్నీ ఆయన తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications