Chandrayaan 3 : చంద్రుడిపై భారత్, చైనా రోవర్లు కలుస్తాయా ? రెండింటి మధ్య దూరం ఇదే..!
చంద్రుడిపై నిగూఢ రహస్యాలను శోధించేందుకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఇప్పటికే చంద్రుడిపై సాప్ట్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ తన పని మొదలుపెట్టేసింది. ఇందులోన నుంచి బయటికి వచ్చిన ప్రజ్ఢాన్ రోవర్ కూడా చంద్రుడిపై బుడిబుడి అడుగులేస్తోంది. ఇప్పటికే చంద్రుడిపై ఉష్ణోగ్రత, మూలకాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఇది ఇస్రోకు పంపుతోంది. దీంతో ఇస్రో కూడా రోవర్ నుంచి రాబోయే 8 రోజుల్లో మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.
అదే సమయంలో చైనా 2019లోనే ప్రయోగించిన చాంగే 4 మిషన్ లోని యుటూ 2 రోవర్ కూడా చంద్రుడిపైనా తిరుగుతోంది. మన ప్రజ్ఞాన్ రోవర్ తో పోలిస్తే అన్ని వాతావరణ పరిస్దితుల్ని తట్టుకునేలా రూపొందించిన ఈ యుటూ 2 రోవర్ ఇంకా చంద్రుడిపై తిరుగుతూ కీలక సమాచారం పంపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మన ప్రజ్ఞాన్ రోవర్ దీన్ని చంద్రుడిపై కలిసే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది. అసలు ఈ రెండింటి మధ్య ప్రస్తుతం ఎంత దూరం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు మన ప్రజ్ఞాన్ రోవర్ కూ, చైనాకు చెందిన యుటూ 2 రోవర్ కూ మధ్య 1948 కిలోమీటర్ల దూరం ఉందని ఇస్రో, నాసాల్లో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎక్స్ డీ లింక్స్ అనే సంస్ధలో పనిచేస్తున్న మాజీ శాస్త్రవేత్త సయ్యద్ అహ్మద్ వెల్లడించారు. మరోవైపు ఇస్రో, నాసా కనిపెట్టలేకపోయిన చంద్రయాన్ 2 ఆచూకీ కనిపెట్టిన చెన్నై ఐటీ నిపుణుడు షణ్ముగ సుబ్రమణియన్ లెక్క ప్రకారం ఈ రెండు రోవర్ల ప్రస్తుత దూరం దాదాపు 1891 కిలోమీటర్లుగా అంచనా. దీంతో ఈ రెండు రోవర్లు కలిసే అవకాశం ఉందా లేదా అన్నది అంచనా వేయాల్సి ఉంది.
Distance between 2 active rovers (#Chandrayaan3 Rover and Chang'e 4 Rover) on Moon is approx 1891 kms (± 5kms) pic.twitter.com/uzj4ePXYjZ
— Shan (Shanmuga Subramanian) (@Ramanean) August 27, 2023
ఈ అంచనాల్ని బట్టి చూస్తే మన ప్రజ్ఞాన్ రోవర్, చైనా రోవర్ యుటూ 2ని కలిసే అవకాశం ఎంతమాత్రం లేదని తేలిపోయింది.ఎందుకంటే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధృవం సమీపంలో సర్వే కోసం ప్రయోగించారు. దాని ల్యాండర్ విక్రమ్ నుండి 500 మీటర్ల వరకు మాత్రమే కవర్ చేయగలదు. మరోవైపు చైనా రోవర్ దాని ప్రారంభ ల్యాండింగ్ సైట్‌కు చాలా దగ్గరగా ఉంది.చైనా రోవర్‌కు విరుద్ధంగా ప్రగ్యాన్ మిషన్ జీవితకాలం ఒక చంద్ర రోజు (సుమారు 14 భూమి రోజులు) మాత్రమే.
ప్రస్తుతం చంద్రుడిపై ఆరు చంద్ర ఆర్బిటర్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. వీటిలో నాసా యొక్క ఆర్టెమిస్ P1, P2 ప్రోబ్స్, లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO), ISRO చంద్రయాన్-2, కొరియా పాత్‌ఫైండర్ లూనార్ ఆర్బిటర్ (KPLO), నాసా యొక్క క్యాప్‌స్టోన్ ఉన్నాయి. తాజాగా మనం ప్రయోగించిన చంద్రయాన్ 3 దీనికి అదనం. అలాగే రాబోయే సంవత్సరంలో చాంగ్'ఈ 6 మిషన్ ద్వారా చంద్రుని దూరం నుండి మొట్టమొదటి నమూనాలను సేకరించేందుకు చైనా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications