అందరూ చూస్తుండగానే పాఠశాల భవనంపై నుంచి దూకిన విద్యార్థిని
తనకు ఇష్టం లేకుండా హాస్టల్‌లో చేర్పించారంటూ ఓ విద్యార్థిని అందరూ చూస్తుండగా పాఠశాల భవనంపై నుంచి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
కరీంనగర్: తనకు ఇష్టం లేకుండా హాస్టల్‌లో చేర్పించారంటూ ఓ విద్యార్థిని అందరూ చూస్తుండగా పాఠశాల భవనంపై నుంచి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
కరీంనగర్ కేంద్రానికి చెందిన హాసిని అనే విద్యార్థిని గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అయితే, తల్లిదండ్రులు తనని చూడటానికి రాలేదని ఆ విద్యార్థిని మనస్తాపానికి గురై భవనంపై నుంచి దూకింది. దీంతో బాలిక కాలు విరిగింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

విద్యార్థిని పాఠశాల భవనంపైనుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను వారించే ప్రయత్నం చేశారు. కానీ, తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు విద్యార్థినిని కాపాడేందుకు దుప్పట్లు పట్టి కాపాడే ప్రయత్నం చేశారు.
కానీ, దుప్పటి చిరిగి కిందపడిపోవడంతో ఆ విద్యార్థిని కాలు విరిగింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన సమాచారం తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.












Click it and Unblock the Notifications