మంత్రి గంగుల కమలాకర్‌కు తప్పిన ప్రమాదం: కాలికి గాయం
కరీంనగర్: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్‌లో ఏర్పాటు చేసిన సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వేదికపై ఉన్న మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగల కాలుకు గాయమైంది.
అయితే, ఈ ఘటనలో కరీంనగర్ జడ్పీటీసీ సభ్యుడి కాలు విరగడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వేదికపైకి పరిమితికి మంచి సభ్యులు రావడంతోనే కుప్పకూలినట్లు తెలుస్తోంది. కాగా, మంత్రి గంగల కాలుకు గాయమైనప్పటికీ తదుపరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైద్యులు చికిత్స నిర్వహించి.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని గంగుల తెలిపారు.

వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. రైతులెవరూ మధ్యవర్తులకు వరి పంటను అమ్ముకోవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరి పంటకు మద్దతు ధర చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.
రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి గంగుల ఆదేశించారు. దేశంలో రెండో పంట కొంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని గంగుల అన్నారు. సీఎం కేసీఆర్ యాగాలు చేస్తే.. ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని, వారి మాటలు నమ్మొద్దన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లోనూ చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications