అక్కడే మకాం వేసిన సీమ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు..!!
కర్నూలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు ఇటీవలే ఇచ్చిన మధ్యంతర స్టేతో ఇప్పటివరకు ఉన్న న్యాయపరమైన చిక్కుముడులన్నీ వీడిపోతున్నట్లుగా భావిస్తోంది. దీనితో అధికార వికేంద్రీకరణ దిశగా తక్షణ చర్యలను తీసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మూడు రాజధానులకు అవసరమైన కొత్త బిల్లు రూపకల్పనపై కసరత్తు మరింత ముమ్మరం చేసింది.
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఊపందుకోనుంది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడానికి, అధికారాన్ని వికేంద్రీకరించడానికి నాన్ పొలిటికల్ జేఏసీ ఇప్పటికే మద్దతు పలికింది. న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ సభ ఏర్పాటు కానుంది.

రాయలసీమ గర్జన పేరుతో ఈ బహిరంగ సభను నిర్వహించబోతోంది జేఏసీ. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించనుంది. లక్షమంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోన్నారు నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు. గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభను తలదన్నేలా దీన్ని ప్లాన్ చేశారు. రాయలసీమ గర్జన పోస్టర్‌ను అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు విడుదల చేశారు.
ఈ గర్జన సభకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తమ ప్రభుత్వమే అధికార వికేంద్రీకరణను ప్రతిపాదించిన నేపథ్యంలో- వారి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇదివరకు నాన్ పొలిటికల్ జేఏసీ- విశాఖపట్నంలో నిర్వహించిన సభను కూడా వైసీపీ నాయకులు విజయవంతం చేశారు. అదే తరహాల కర్నూలులో నిర్వహించ తలపెట్టిన సభకూ వైసీపీ నాయకులు అండగా ఉండనున్నారు.
కర్నూలులో జోరుగా సభ ఏర్పాట్లు సాగుతున్నాయి. నగరం నిండా ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే బ్యానర్లు కనిపిస్తోన్నాయి. ఎస్టీబీసీ గ్రౌండ్స్‌కు వెళ్లే మార్గం పొడవునా పెద్ద ఎత్తున వాటిని కట్టారు. సభ నిర్వహణ ఏర్పాట్లను జిల్లాకు చెందిన మంత్రులు గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్, లోక్‌సభ సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, గడికోట శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు.