అలర్ట్: కొమురవెల్లి మల్లన్న మూల విరాట్ దర్శనం నిలిపివేత, ఎందుకంటే?
మెదక్: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో సోమవారం సాయంత్రం నుంచి జనవరి 6వ తేదీ వరకు మూలవిరాట్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. జనవరి 7న స్వామి వారి కళ్యాణం సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కు అలంకరణ పనులు జరుగుతున్నాయని ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం అర్థ మండపంలో ఉత్సవ విగ్రహాల దర్శనం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఆదివారం(జనవరి 7న) తెల్లవారుజాము నుంచి భక్తులకు తిరిగి మూలవిరాట్ దర్శనం ప్రారంభం కానుందని ఆలయ ఈవో బాలాజీ పేర్కొన్నారు.

కాగా, నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు సోమవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం క్యాలైన్లు కట్టారు. అర్చనలు, అభిషేకాలు, పట్నాలు వేసి ఒడిబియ్యం పోసి గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి బోనాలు చెల్లించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మట్టి పాత్రలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. ఇటు యాదాద్రి కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. న్యూ ఇయర్ రోజు సెలవు కావడంతో హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు వచ్చారు. స్వామివారి దర్శనానికి సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్వామి వారి కళ్యాణానికి వారం రోజులున్నా అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేయలేని దుస్థితి నెలకొందని భక్తులు అన్నారు. ఆలయ ఆవరణంలో మంచి నీళ్లు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications