తెలంగాణా లాయర్ల హత్య మరువకముందే నెల్లూరులో ప్రముఖ న్యాయవాదిపై హత్యాయత్నం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రముఖ న్యాయవాది కొండ రమేష్ పై గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారు. పట్టపగలు ఆయన ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చేసి రమేష్ ను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, గట్టు నాగమణి లను నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన మరిచిపోకముందే నెల్లూరు లో కూడా న్యాయవాది పై దుండగులు మారణాయుధాలతో తెగబడ్డారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ సీన్ రిపీట్ కావడంతో, ఒక్కసారిగా న్యాయవాద వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడైన న్యాయవాది కొండ రమేష్ పై గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటికి వెళ్లి మరి దాడికి దిగారు. అయితే దుండగుల నుండి తప్పించుకొని తీవ్రగాయాలతో లాయర్ కొండ రమేష్ బయట పడ్డారు. దుండగుల దాడిలో న్యాయవాది రమేష్ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల నుండి తప్పించుకున్న రమేష్ ను స్థానికులు నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో రమేష్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న రమేష్ ను వెంటనే ఆసుపత్రికి తరలించటంతోనే ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు.
అయితే కొండ రమేష్ కు , అతని అన్నదమ్ములకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కొండ రమేష్ తనపై జరిగిన దాడిపై బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని లేదంటే చంపేస్తామని రౌడీ మూకలు కొండ రమేష్ కుటుంబాన్ని బెదిరిస్తున్నట్లుగా పోలీసులకు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయవాది పై జరిగిన దాడి పై దర్యాప్తు చేస్తున్నారు.