అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ అభ్యర్థి ఫిక్స్
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట ఉమ్మడి నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఇదీ ఒకటి. 2014లోనూ మెజారిటీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుందీ పార్టీ. ఇప్పుడు అదే జిల్లా నుంచి తిరుగుబాట్లు మొదలయ్యాయి. అసమ్మతిని ఎదుర్కొంటోంది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీలో అసమ్మతి చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చేలా కసరత్తు సాగిస్తోంది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల నియామకాలపై దృష్టి సారించింది. కీలకమైన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి తాజాగా ఇన్‌ఛార్జీని నియమించింది.

మాజీ మంత్రి పొంగూరు నారాయణకు నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది టీడీపీ. ఈ మేరకు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జిగా నారాయణను నియమిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోన్న నియోజకవర్గం ఇది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి ఘన విజయాలను సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీధర కృష్ణారెడ్డిని సుమారు 19 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. 2019లో పొంగూరు నారాయణపై 1,988 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారాయణకే మరోసారి అవకాశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినప్పటికీ.. అనిల్ కుమార్ యాదవ్‌కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ మరోసారి నారాయణనే నమ్ముకుంది. ఈ నియోజకవర్గంలో వైెఎస్ఆర్సీపీకి గట్టిపోటీ ఇచ్చే నాయకుడు మరొకరు లేకపోవడం, ఆర్థికంగా బలవంతుడు కావడం వల్ల నారాయణకే అవకాశం ఇచ్చింది.
నిజానికి- ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భావిస్తోన్నారు. 1983లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మళ్లీ ఎప్పుడూ నెల్లూరు సిటీ సీటు గడప తొక్కలేదు. టీడీపీ ద్వారా ఆ కొరతను తీర్చుకోవాలని భావించినప్పటికీ..సాధ్యపడలేదు. టీడీపీలో చేరుతారా? లేదా? అనేది కూడా ఇప్పుడు అనుమానమే.












Click it and Unblock the Notifications