'సింహపురి' రాజకీయంలో కీలక మలుపులు?
గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో సమాన బలం ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో వైసీపీ మొత్తం 10 సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడటం దాదాపు ఖాయమే.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆనం, కోటంరెడ్డి
ఆత్మకూరు, నెల్లూరు రూరల్, వెంకటగిరి స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, నెల్లూరు నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీచేయించే ప్రతిపాదనలున్నాయి. ఆత్మకూరు నుంచి ఆనం కుమార్తె పోటీచేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మహానాడు సమయంలో ఆమె చంద్రబాబు, లోకేష్ ను కలిశారు.జగన్ కు వీరాభిమానిగా ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్యంగా పార్టీకి వ్యతిరేకంగా మారారు.
తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంపై ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రశేఖర్ రెడ్డికి కూడా కష్టమే?
వీరిద్దరూ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో కోటంరెడ్డిని, ఆనంను నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఇక్కడ వేరేవారు పోటీచేయడం ఖాయమైంది. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి కూడా ఈసారి ఎన్నికల్లో సీటివ్వడం అనుమానమేనంటున్నారు.
దీన్నిబట్టి నెల్లూరు జిల్లాలో వైసీపీ తరఫున సిట్టింగ్ స్థానాల్లో ముగ్గురు కొత్త వ్యక్తులు పోటీచేయడం ఖాయమైంది. అధిష్టానం వద్ద ఆయనకు మంచి పలుకుబడి ఉన్నప్పటికీ సీటు కేటాయింపు, గెలుపునకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో భాగంగా అతనికి సీటివ్వకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఇటీవలే చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యం బారిన పడి కోలుకున్నారు.

గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి
ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటేనే ఆనం, నేదురుమల్లి, మేకపాటి కుటుంబాలు స్ఫురణకు వస్తాయి. గత ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయన అనూహ్యంగా కన్నుమూశారు. ప్రస్తుతం అక్కడ విక్రమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ నిరాకరించి విక్రమ్ రెడ్డికి ఒక్కడికే ఇచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజకీయంగా దూకుడుగా నిర్ణయం తీసుకోలేదు.
సొంత పార్టీలోనే ఉంటూ అసమ్మతి నేతలుగా మారారు. వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ తరఫున మూడు కొత్త ముఖాలు పోటీచేయడం మాత్రం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications