కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి నిరసనసెగ.. ఆగ్రహించిన ఎమ్మెల్యే, టార్గెట్ చేసిన టీడీపీ!!
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నేటికీ ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని కావలి మండలం బట్లదిన్నెలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని ప్రజలు నిలదీశారు.

ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు.. మండిపడిన కావలి ఎమ్మెల్యే
కావలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలి అంటూ ఆయనను ప్రశ్నించారు. తమ గ్రామానికి ఏం చేశారో చెప్పాలంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రజలు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ, సమస్యలను ఏకరువు పెట్టిన గ్రామస్తులు ఎమ్మెల్యే పై మండిపడ్డారు. గ్రామంలో అభివృద్ధి చేసింది శూన్యమని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఒక్కసారిగా సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తాను చెప్పింది నోరుమూసుకొని వినాలంటూ ఫైరయ్యారు.

రోడ్ల సమస్యపై ఎమ్మెల్యే చెప్పిందిదే ..
ఇప్పటికే గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయిందని, త్వరలోనే పనులు ప్రారంభించి రోడ్డు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బట్లదిన్నె గ్రామానికి రోడ్డు వేయించలేకపోతే ఇక మీ ఊరికి రానని ఓట్లు అడగనని ఎమ్మెల్యే గ్రామస్థులతో తెలిపారు. గ్రామస్తులు తనపై నమ్మకం ఉంచుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సూచించారు. రోడ్డు వేయించకపోతే ఓట్లు కూడా అడగనని పేర్కొన్న ఆయన, తెలుగుదేశం పార్టీ నేతలపై మండిపడ్డారు. వాడెవడో టిడిపి వాడు మాట్లాడాడని, మీరు కూడా మాట్లాడడం మంచిది కాదంటూ గ్రామస్తులకు సూచించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎమ్మెల్యే, గామస్తుల వాగ్వాదం
ప్రస్తుతం గ్రామస్తులకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కి మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఈ విధంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని భావించిన వైసీపీ ప్రభుత్వానికి, గడప గడపలో అభివృద్ధిపై, ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్న తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీకి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయుధంగా మారింది.
Recommended Video


సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసే టార్గెట్ చేసిన టీడీపీ
ఇక దీనిపై టార్గెట్ చేసిన టీడీపీ మూడేళ్ళ పాలన తర్వాత కూడా 'నీకు ఇది చేసాం' అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ నేతలది అంటూ పేర్కొంది. జగన్ రెడ్డి పాలనతో గడప గడపకి నిరసన సెగలు, నిలదీతలు ఎదురవుతుంటే సమాధానం చెప్పలేక అసహనానికి గురవుతున్నారు అంటూ కావలి ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చూడండి అంటూ వీడియో ని పోస్ట్ చేసి కావలి ఎమ్మెల్యే ను టార్గెట్ చేసింది.












Click it and Unblock the Notifications