Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెథాయ్ మిగిల్చిన చేదు జ్ఞాపకం: మట్టిని నమ్ముకున్న రైతు ఆ మట్టిలోనే కలిశాడు

శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. వరస ప్రకృతి వైపరీత్యాలతో శ్రీకాకుళం అల్లాడిపోతోంది. మట్టిని నమ్ముకున్న రైతు అదే మట్టిలో కలిసిపోయే పరిస్థితి తలెత్తింది. తుఫాను దెబ్బకు పంటను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో రైతు ఓడిపోయాడు. అతని నిస్సహాయతే అతని ప్రాణాలను బలిగొంది. మొన్న తిత్లీ తుఫాను అపార నష్టం మిగిల్చి పోగా దాని నుంచి తేరుకోకముందే మరో తుఫాను పెథాయ్ రూపంలో ముంచుకొచ్చి రైతన్నకు తీరని నష్టాన్ని తీసుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఓ రైతు పంట నష్టాన్ని చూసి ఆవేదనకు గురై పొలంలోనే మృతి చెందాడు.

 బాధతో మూగబోయిన రైతన్న గుండె ఆగిపోయింది

బాధతో మూగబోయిన రైతన్న గుండె ఆగిపోయింది

తుఫాన్ ఇంటిని కూల్చింది. పంటను ముంచింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు క్రమంగా పెరుగుతూ చేతికొచ్చిన పంటను చిదిమేసింది. చేను చూసేందుకు వెళ్లిన అన్నదాత చివరిగా అక్కడే ఆగిపోయాడు. ఆయన ఆక్రందన ఎవరూ వినలేదు. అతని ఆవేదన ఎవ్వరికీ అర్థం కాలేదు. బాధతో మూగబోయిన గుండె ఆగిపోయింది. పొలాన్ని చూసేందుకు బయల్దేరిన యజమాని తిరిగొస్తాడని ఎదురుచూసిన ఆ ఇంటికి శవమై కనిపించాడు.

ఏపీపై కన్నెర్ర చేసిన ప్రకృతి

ఏపీపై కన్నెర్ర చేసిన ప్రకృతి

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్లు ముంచెత్తుతున్నాయి. మొన్న తిత్లీ తుఫాను రాష్ట్రంపై కన్నెర్ర చేయగా... నిన్న పెథాయ్ తుఫాను ఉగ్రరూపం దాల్చింది. దీంతో రైతన్నకు తీరని నష్టం జరిగింది. ఒక్క పంటకు మాత్రమే తుఫాను నష్టం చేకూర్చలేదు... రైతన్న ప్రాణాలను సైతం పరోక్షంగా మింగేసింది. పెథాయ్ తుఫాను కారణంగా నిన్న కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. పెథాయ్ తుఫాను తీరం దాటే క్రమంలో భారీ వర్షాలు కురియడంతో రైతన్నలు పండించిన పంట ఇక చేతికి వస్తుందనగా ఆయన ఆశలపై గండికొట్టింది తుఫాను. దీంతో ధ్వంసమైన పంటను చూసి రైతన్న గుండెలవిసేలా రోదించాడు.

పంట దెబ్బతినడంతో ఆవేదనకు గురై పొలంలోనే మృతి

పంట దెబ్బతినడంతో ఆవేదనకు గురై పొలంలోనే మృతి

శ్రీకాకుళం జిల్లాకు కూడా అపార నష్టం మిగిల్చింది పెథాయ్ తుఫాను. అంతకుముందు తిత్లీ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి రైతు తేరుకోకముందే మళ్లీ పెథాయ్ తుఫాను ఆ జిల్లాపై పంజా విసిరింది. పెథాయ్ తుఫాను పంటపై పగబట్టడంతో గొట్టిపల్లి చిన్నవాడు అనే రైతు మృతి చెందాడు. తుఫాను సృష్టించిన బీభత్సానికి తన చేతికందాల్సిన పంట నీటిపాలు కావడంతో గొట్టిపల్లి చిన్నవాడు అనే ఈ రైతు కృంగి పోయాడు. వరద నీరు పొలంలోకి చేరడంతో దిగువకు వదులుదామని భావించి ఆ నీటిని దిగువకు వదిలే క్రమంలో అక్కడే కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే మృతి చెందాడు. తన పొలంలోనే గొట్టిపల్లి చిన్నవాడు చివరి శ్వాస విడవడంతో అక్కడి స్థానికులను కలచివేసింది. ఆయన మృతదేహం పొలాల్లోనే ఉండిపోయిన దృశ్యాన్ని చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతుల డిమాండ్

ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతుల డిమాండ్

ఆరుగాలం కష్టించి పండించిన పంట తీరా చేతికందే సమయానికి నీటిపాలవ్వడంతో రైతుల పరిస్థితి అద్వాన్నంగా మారింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తిత్లీ తుఫాను బారినుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో ప్రకృతి వైపరీత్యం పగబట్టినట్లుగా పంటను నాశనం చేయడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ తమ పంటను మాత్రం కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన పంటకు తగిన పరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+