తుది ఘట్టానికి మిస్ వరల్డ్ 2025 పోటీలు.. స్పెషల్ గెస్టులుగా సామాన్యులు !
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా " మిస్ వరల్డ్ 2025 " పోటీలను నిర్వహిస్తోంది. మే 10వ తేదీ నుంచి జరుగుతున్న ఈ పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. 72వ ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడగా.. నలుగురు ఫైనల్స్ కు చేరారు. గ్రాండ్ ఫినాలేని వచ్చే ఆదివారం నాడు హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఫినాలే కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుది పోటీలు హైటెక్స్‌లోని హాల్ నంబర్ 4లో జరుగుతాయని.. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:20 గంటలకు ముగుస్తాయని వివరించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్‌లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సామాన్యులే స్పెషల్ గెస్టులు..
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ అంతర్జాతీయ వేడుకలో కేవలం ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా సుమారు 7500 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వారిలో దాదాపు వెయ్యి మందికి అవకాశం కల్పించనున్నట్లు జయేశ్ రంజన్ తెలిపారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచినట్లు ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఫైనల్స్‌కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్లు కొనసాగుతున్నాయని.. మే 30, 31 తేదీల్లో పూర్తిస్థాయి రిహార్సల్స్ జరుగుతాయన్నారు. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ను సోనీ టీవీ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందని స్పష్టం చేశారు. తుది పోటీలకు న్యాయనిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే వివరాలను మిస్ వరల్డ్ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని జయేశ్ రంజన్ తెలిపారు.












Click it and Unblock the Notifications