తెలంగాణలో కొత్తగా 2484 కరోనా కేసులు, ఒకరు మృతి: కేసులు తగ్గినా జాగ్రత్త అంటూ హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, 65,263 నమూనాలను పరీక్షించగా 2,484 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,61,050కి పెరిగింది. కరోనా బారినపడి ఒకరు మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 7,18,241 మందికి కరోనా నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.38 శాతంగా ఉంది. మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా, 1045 మందికి కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,723 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.

అందుబాటులో 20 వేల ఆక్సిజన్ బెడ్స్: మంత్రి హరీశ్ రావు
కరోనా వ్యాపిస్తున్న క్రమంలో రాష్ట వ్య్రాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టిందని, అయినా ప్రజలందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
తెలంగాణ ప్రజల ఆరోగ్యసంరక్షణ కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా సమయంలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నవారికి కరోనా వైద్య కిట్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. కరోనా మూడోదశ నుండి బయటపడితే ఎప్పటిలాగే సంక్షేమ పథకాలు మరింత ముందుకు సాగుతాయని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు.
తెలంగాణలో వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి, జాహీరాబాద్ ఆస్పత్రులలో సాధారణ డెలివరీలు జరగడంపై ఆసుపత్రి వర్గాలను అభినందించిన మంత్రి హరీష్ రావు.. రానున్న రోజుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య 75 శాతం మేర పెరగాలన్నారు. అందులో భాగంగా జహీరాబాద్ లో 50 పడకల మాతాశిశు సంక్షేమ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రి సౌకర్యాల కోసం రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్ ఆస్పత్రికి బ్లడ్ స్టోరేజీ సౌకర్యాన్ని లేదా బ్లడ్ బ్యాంక్ ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications