తెలంగాణలో రేపు 4 కీలక పథకాలు ప్రారంభం: అధికారులకు సీఎం వార్నింగ్
ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాపలై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రేపే (జనవరి 26న) ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
వీటితోపాటు రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. .ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా అమలు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.
సీఎం సమీక్షకు సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రులు వెల్లడించారు. జనవరి 26న లాంఛనంగా పథకాలు ప్రారంభిస్తామని చెప్పామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామసభలు నిర్వహించి అర్హత కలిగిన లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఆదివారం( జనవరి 26) రాష్ట్రంలో రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభిస్తామన్నారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications