తెలంగాణా బీజేపీ కోసం రంగంలోకి 600మంది; జులై 8న కీలక సమావేశం!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకపక్క అధికార బి ఆర్ ఎస్ ఈసారి అధికారంలోకి రావాలని ప్రజాక్షేత్రంలో వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతుంటే, ఈసారి బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి.
ముఖ్యంగా బిజెపి అగ్రనాయకులను రంగంలోకి దింపి తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం శాసనసభ ఎన్నికలు జరగనున్న కారణంగా తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ పెడుతున్న బిజెపి, ఇప్పటికే జాతీయ నాయకులను రంగంలోకి దింపి తెలంగాణలో జోరుగా పర్యటనలు సాగిస్తోంది. బిజెపి మహాజన్ సంపర్క అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ వేదికగా జూలై 8 వ తేదీన 11 రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పై సానుకూల ప్రభావం చూపిస్తోందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నేడు వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపడతారు.

వీరంతా జులై 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఉంటారు. మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్లో మూడు బృందాలుగా విడిపోయి వీరు మేరా పోలింగ్ బూత్.. సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయిలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో బిజెపి క్షేత్రస్థాయిలో దూకుడును కొనసాగించడానికి, చరిష్మా ఉన్న నాయకులను తీసుకువచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications