పేద్ద అభిమాని: ముచ్చటపడి ఫొటోలు దిగిన డిప్యూటీ సీఎం అలీ(ఫొటోలు)
హైదరాబాద్: సినీనటులకు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, రాజకీయ నేతలకు అభిమానులుండటం సాధారణ విషయమే. మన ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి కూడా ఓ చోటా, కాదు బడా అభిమాని దొరికాడు. సోమవారం మహమూద్ అలీని కలవాలంటూ పాలమూరు జిల్లాలోని ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న 13ఏళ్ల పేద విద్యార్థి సమీఉల్లా వచ్చాడు.

అతని తండ్రి రఫియోద్దీన్ స్థానిక మసీదులో పనిచేస్తారు. ఏదైనా సమస్య పరిష్కారానికి వస్తున్నాడేమోనని భావించి డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. తండ్రితో కలిసి సచివాలయం డీ-బ్లాక్‌లోని డిప్యూటీ సీఎం ఛాంబర్‌కు వచ్చాడు.
డిప్యూటీ సీఎంను చూడగానే 'మై ఆప్‌కా బడా ఫ్యాన్ హు. కయీ దిన్ సే ఆప్‌కో మిల్‌నేకి ఖ్వాయిష్ థీ. మై ఆప్‌కో బహుత్ చాహతాహు (నేను మీ పెద్ద అభిమానిని. మీతో వ్యక్తిగతంగా కలువాలనే కోరిక చాలా రోజుల నుంచి ఉంది. మిమ్మల్ని నేను అమితంగా అభిమానిస్తాను)' అని చెప్పే సరికి డిప్యూటీ సీఎం ఆశ్చర్యపోయారు. సమీఉల్లా మాటలు విని ముచ్చటపడిన మహమూద్ అలీ.. తన ఛాంబర్, యాంటీ రూమ్‌లోకి స్వయంగా తీసుకెళ్ళి చూపించారు.

'బుద్ధిగా చదువుకుంటే నువ్వు కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారివి అవుతావు. అపుడు నీకు కూడా ఇలాగే ఒక ప్రత్యేక చాంబర్ ఉంటుంది' అని తెలిపారు. 'అధికారులు, సిబ్బందితో నీకు కార్యాలయం కూడా ఉంటుంది' అని ఆ బాలుడిని ఆశీర్వదించి వెన్ను తట్టారు. ఆ తర్వాత ఆ విద్యార్ధి డిప్యూటీ సీఎంతో ఫోటోలు దిగాడు. కాగా, ఈ ఫోటోలను జాగ్రత్తగా దాచుకుంటానని ఆ బాలుడు సంబరంగా చెప్పాడు.












Click it and Unblock the Notifications