ప్రియుడి కోసం దొంగగా మారిన యువతి: అరెస్ట్
హైదరాబాద్: ప్రేమ కోసం ప్రేమికులు ఎన్నో త్యాగాలు చేసినట్లు చూశాం. అయితే ఇక్కడ మాత్రం ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం ఏకంగా దొంగగా మారిపోయింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. పోలీసులు కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన పొన్నుగంటి ప్రవల్లిక(19) యూసుఫ్‌గూడలోని యాదగిరినగర్‌లో తల్లితో కలిసి నివాసముంటోంది.
జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న కెఎల్‌ఎస్‌ఎన్ శర్మ, సూరమ్మ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఉండే జిలానీ(20)ని కొంతకాలంగా ప్రేమిస్తోంది. విలాస జీవితానికి అలవాటుపడ్డ అతను తనకు మంచి బైక్ కొనాలని ఉందని ప్రియురాలికి చెప్పాడు. దీంతో ఆమె తాను పనిచేస్తున్న ఇంట్లో బంగారం తస్కరించి అమ్మేసింది.

వచ్చిన సొమ్ముతో ప్రియుడికి బైక్ ఇప్పించింది. ఇలా అనేక సార్లు బంగారాన్ని అపహరిస్తూ.. వచ్చిన డబ్బులతో మల్టీఫ్లెక్స్‌లు, ఐస్‌క్రీం పార్లర్లు తిరగడమే కాకుండా జిలానీకి బంగారు చైన్ కూడా చేయించింది. ఇది ఇలా ఉంటే.. శర్మ దంపతులు మాత్రం బంగారాన్ని దెయ్యాలే మాయం చేస్తున్నాయన్న మూఢనమ్మకంతో పూజలు కూడా చేయించారు.
అయినా చోరీలు ఆగకపోవడంతో చివరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు, శర్మ ఇంటిపై నిఘా పెట్టారు. చివరికి పనిమనిషి ప్రవల్లికనే దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించేసరికి నేరాన్ని అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications