వివాహేతర సంబంధం: కోర్టు ప్రాంగణంలో భార్య గొంతు కోసిన భర్త
హైదరాబాద్: నగర శివారు రాజేంద్రనగర్ కోర్టు ఆవరణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి పరారయ్యాడు. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
బాధితురాలిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. లంగర్‌హౌజ్ ప్రాంతానికి చెందిన నాగేందర్‌బాబు, సౌజన్య దంపతులు ఏడాదిన్నర క్రితం కుటుంబ కలహాల కారణంగా విడాకులు కోసం రాజేంద్రనగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వీరిద్దరికీ పదేళ్ల క్రితం వివాహం కాగా... ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, ఈ మధ్యకాలంలో నాగేందర్‌బాబు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవడం లేదంటూ సౌజన్య కోర్టును ఆశ్రయించింది. తన పోషణ ఖర్చులు చెల్లించేలా భర్తను ఆదేశించాలని కోరింది.
దీనిపై సోమవారం కోర్టులో విచారణ ఉండటంతో వీరిద్దరూ న్యాయస్థానానికి వచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత బయటకు వస్తున్న సమయంలో నాగేందర్‌బాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో సౌజన్య గొంతుకోసి పరారయ్యాడు.

గతంలో కూడా సౌజన్యపై నాగేందర్ వరకట్నం వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సౌజన్య ఫిర్యాదుతో నాగేందర్ కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తనకు, తన కొడుకు పోషణ ఖర్చులు చెల్లించేలా సౌజన్య కోర్టులో పిటిషన్ వేసింది. సోమవారం విచారణలో భాగంగా హాజరైన సౌజన్యపై భర్త నాగేందర్ కత్తితో దాడి చేసి గొంతుకోశాడు.












Click it and Unblock the Notifications