మునుగోడులో టీఆర్‌ఎస్‌కు కొత్త పరేషాన్.. కారును పోలిన 8గుర్తులపై నేడు లంచ్ మోషన్ పిటీషన్!!
మునుగోడు ఉప ఎన్నికల పర్వం అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైంది. మునుగోడు ఉప ఎన్నికలలో ఒక్కో పార్టీ ఒక్కో సమస్యను ఎదుర్కొంటోంది. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రతిఘటన ఎదుర్కొంటుంటే, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలలో సమన్వయ లేమితో కష్టాలు పడవలసి వస్తుంది. ఇక టిఆర్ఎస్ పార్టీ సైతం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడంతో పాటు, ఇప్పుడు కారును పోలిన గుర్తులతో కొత్త సమస్యను ఎదుర్కొంటుంది.

మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8గుర్తులు.. ఈసీకి విజ్ఞప్తి
ఇప్పటి వరకూ జరిగిన అనేక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి కారును పోలిన గుర్తులతో పదేపదే సమస్య ఎదురవుతూనే ఉంది. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులతో టిఆర్ఎస్ పార్టీ ఆందోళనకు లోనవుతుంది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టుమిషన్, ఓడను తొలగించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన ఎన్నికల కమిషన్ ను టిఆర్ఎస్ పార్టీ కోరింది.
ఇప్పటికే పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల స్వల్ప తేడాతో ఓడిపోయారు అని అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించ వద్దని టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

న్యాయపోరాటానికి దిగిన టీఆర్ఎస్
అయితే కారును పోలిన గుర్తులను తొలగించే విషయంలో ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో టిఆర్ఎస్ పార్టీ కారును పోలిన 8 గుర్తులను తొలగించాలంటూ న్యాయ పోరాటానికి దిగింది. గతంలో 2018 ఎన్నికలలోనూ కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల నష్టం జరిగిందని టిఆర్ఎస్ చెబుతోంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల వల్లే ఎక్కువ ఓట్లు వచ్చాయని, కారును పోలి ఉన్నందున వారికి ఓట్లు పడ్డట్టు స్పష్టమవుతోందని ఈసీకి టీఆర్ఎస్ వివరించే ప్రయత్నం చేసింది.

గతంలోనూ అనేక ఎన్నికల్లో కారును పోలిన గుర్తు
హుజురాబాద్, మునుగోడు, సిర్పూర్, డోర్నకల్ లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ పార్టీ గుర్తుకు సిపిఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు నర్సంపేట, దుబ్బాక, చెన్నూరు, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లలో కూడా కెమెరా గుర్తుకు సిపిఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని పేర్కొన్నారు. గతంలో అనేక ఎన్నికల్లో గుర్తుల వల్ల ఏర్పడిన గందరగోళాన్ని ఈసీకి వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఈ విషయంలో ఈసీ స్పందించలేదు.

నేడు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసేందుకు టీఆర్ఎస్ రెడీ
ఈ కారణాల వల్ల మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఉన్న ఎనిమిది కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి కోరి పిటిషన్ వేయడానికి టిఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మరి కారును పోలిన గుర్తుల విషయంలో న్యాయపోరాటానికి దిగిన టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రయత్నంలో ఏ మేరకు సఫలం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కోర్టు విచారణకు స్వీకరిస్తుందా? అసలేం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications