పాకిస్థాన్ నుంచి వచ్చి హైదరాబాదీని పెళ్లాడాడు, మతం మార్చి, బెదిరింపులు, పోలీసుల ఎంట్రీతో
హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నగరానికి చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకున్నాడు. తాను ఢిల్లీ వాసినంటూ అబద్ధాలు చెప్పి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు. అతను చెప్పినవన్నీ నమ్మిన యువతి.. చివరకు నిజం తెలిసి మోసపోయానని గుర్తించింది. అయితే, తన విషయం బయటపెడితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

పాక్ నుంచి వచ్చి ఢిల్లీ వ్యక్తినంటూ హైదరాబాదీని పెళ్లాడాడు..
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ సందర్శకుల వీసాపై విదేశాల్లో కచేరీలు ఇస్తుంటాడు. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో నివసించే ఓ యువతి కూడా విదేశాల్లో పాటలు పాడుతుంటారు. తొమ్మిదేళ్ల క్రితం ఇక్రమ్ ఆ యువతికి దుబాయ్‌లో పరిచయమయ్యాడు. తాను ఢిల్లీకి చెందిన ముస్లింగా పరిచయం చేసుకున్న అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇందుకు ఆమె కూడా అంగీకరించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చేరుకున్న నెల రోజుల్లోనే అతనూ ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

భార్య మతం మార్చాడు.. బయటికి చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు
పెళ్లైన తర్వాత భర్త కోసం ఆమె కూడా ఇస్లాం మతంలోకి మారింది. చాదర్‌ఘాట్‌లోనే కాపురం పెట్టారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె ఢిల్లీలోని అత్తారింటికి వెళ్దామని అడిగింది. దీంతో ఇక్రమ్ అసలు విషయం బయటపెట్టాడు. తాను పాకిస్థాన్ వాసినని, విజిటింగ్ వీసాతో వచ్చానని తెలిపాడు. అంతేగాక, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదరింపులకు గురిచేశాడు. దీంతో భయపడుతూనే అతనితో జీవిస్తోంది. అప్పట్నుంచి తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది.

ఈ పాకిస్థాన్ వ్యక్తికి ఆధార్ కార్డుతో సహా అన్ని దొరికాయి..
చాదర్‌ఘాట్‌లోనే నివసించే నిజాం ఖాజా అనే వ్యక్తి ద్వారా ఆధార్ కార్డ్, వంగర్‌లో ఉంటున్న అతడి స్నేహితుడి ద్వారా 10వ తరగతి, ఇంటర్ ధృవపత్రాలను పొందాడు. వాటిని ముంబైలోని రాష్ట్రీయ విద్యాపీఠ్ పేరుతో నకిలీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రమేష్ మూలేకి పంపి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టాను రూ. 10వేలకు కొన్నాడు. అవే నకిలీ పత్రాలతో ఏడేళ్ల కిందట భారత పాస్‌పోర్ట్ కూడా పొందడం గమనార్హం.

పోలీసుల ఎంట్రీతో పాకిస్థానీ మహమ్మద్ అబ్బాస్ ఇక్రమ్ గుట్టురట్టు
తనపై వేధింపులు భరించిన బాధితురాలు.. ఆరేళ్ల వయస్సున్న కుమార్తె పట్ల కూడా భర్త ఇక్రమ్ అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించలేకపోయింది. దీంతో మూడేళ్ల క్రితమే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018 జులైలో నిందితుడు ఇక్రమ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. అతడి ఇంట్లో జరిపిన తనిఖీల్లో పాక్ పాస్‌పోర్టు లభించడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో విచారణ జరపగా ఆధార్ కార్డ్, ఇతర ధృవపత్రాలు నకిలీవని తేల్చారు. పాస్ పోర్టును కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించగా.. అతను పాకిస్థాన్ పౌరుడేనని ధృవీకరించింది. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తాజాగా ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. అతడికి నకిలీ హోటల్ మేనేజర్‌మెంట్ డిగ్రీ ధృవపత్రం ఇచ్చిన రమేష్ మూలేకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పాతబస్తీలో బాల్య వివాహాలు, సౌదీ అరేబియా, ఇతర దేశాల షేక్‌లు ఇక్కడికి వారికి డబ్బులిచ్చి వారి కూతుళ్లను పెళ్లి చేసుకునే కేసులు గతంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ముసలి షేక్‌లు ఇక్కడి యువతులను డబ్బులిచ్చి పెళ్లి చేసుకునేవారు. ఇటీవల ఇలాంటి కేసులు చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications